నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విక్టరీ సాధించింది. టీ20 సిరీస్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. వన్డేల్లో కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేసిందనే చెప్పాలి. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపొందింది. ఇంగ్లీష్ టీమ్ విధించిన 248 పరుగుల టార్గెట్‌ను కేవలం 38.4 ఓవర్లలోనే చేధించింది టీమ్ ఇండియా.
టార్గెట్ చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలిందని చెప్పాలి. జైస్వాల్,రోహిత్ శర్మ ఈజీగా ఔటయ్యారు. ఆ తర్వాత గిల్, అయ్యర్ ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేశారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 113 పరుగులు చేశారు. అయితే బెతెల్ శ్రేయస్‌ను ఔట్ చేయడంతో ఈ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా చెలరేగి ఆడాడు. వీరిద్దరే మ్యాచ్‌ను ముగిస్తారనుకున్నారంతా. కానీ అక్షర్ పటేల్‌ను రషీద్ బౌల్డ్ చేయడం.. ఆ తర్వాత వచ్చిన రాహుల్ కేవలం రెండు పరుగులకే ఔట్ అవ్వడంతో కాస్త నిరాశ ఎదురైంది. ఆ తర్వాత గిల్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. కానీ హార్దిక్, జడేజా మ్యాచ్‌ను ముగించారు. ఓవరాల్‌గా చూస్తే శుభ్‌మన్ గిల్ 87 పరుగులు, అక్షర్ పటేల్, అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమ్ ఇండియా గెలుపు ఈజీ అయ్యింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 248 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. సాల్ట్, డకెట్ ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేశారు. 75 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా చేజారకుండా ఆడారు. కానీ సాల్ట్, డకెట్, హ్యారి బ్రూక్ వెంట వెంటనే ఔట్ అవ్వడంతో మ్యాచ్‌పై పట్టు బిగించింది టీమ్ ఇండియా. కానీ బట్లర్, బెతెల్ హాఫ్ సెంచరీలు చేయడంతో మళ్లీ ఇంగ్లండ్ స్కోర్ పరుగులు పెట్టింది. హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడు వికెట్లతో చెలరేగిపోయారు. ఇక షమీ, అక్షర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.