హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద చేపట్టే వంతెనలు, కాలువల నిర్మాణంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం విజయవాడలోని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద చేపట్టే పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల విస్తరణంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. హంద్రీ-నీవా మడకశిర బ్రాంచ్ కాలువ కింద మూడు సబ్ చానళ్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. చాళకూరు, రొద్దం మండలం కొగిర, పెనుకొండలోని రాంపురంలో ఈ సబ్ చానళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మూడు సబ్ చానళ్లతో 30 చెరువులకు నీరందరించే అవకాశం ఉందన్నారు. ఈ 30 చెరువులు నీటితో నింపితే, పెనుకొండ సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి సవిత వెల్లడించారు. తక్షణమే సబ్ చానళ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి సవిత కోరారు.