భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ నేతల మాటలు పరస్పర విరుద్ధంగా మారాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ దేశానికి ఎలాంటి నష్టం జరగలేదని, గెలిచింది తామేనని ధీమాగా ప్రకటించగా, పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం వాస్తవ పరిస్థితి మరోలా ఉందని సూచిస్తున్నాయి. భారత్ తమ 11 ఎయిర్ బేస్‌లపై తీవ్రమైన దాడులు చేసిందని ఆయన స్వయంగా అంగీకరించారు. ఈ దాడుల్లో పాక్‌కు చెందిన కొన్ని విమానాలు దెబ్బతిన్నాయని కూడా వెల్లడించారు. భారత్ ఒక జెట్‌ను కూల్చినట్లు ఆధారాలున్నప్పటికీ, తమ వైమానిక సామర్థ్యం పూర్తిగా ప్రభావితమైందని అంగీకరించకుండా, కొంత మేరకు మాత్రమే నష్టం జరిగిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా, భారత పైలట్ తమ అదుపులో లేడని స్పష్టంగా చెప్పారు.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ఒక దశలో తమకు నష్టం ఏమీ జరగలేదని, పైగా భారత్‌కు తీవ్ర నష్టం కలిగిందని ప్రచారం చేసింది. ఉపగ్రహ చిత్రాలతో సహా భారత్ తమ దాడుల్లో సాధించిన విజయాన్ని వివరంగా చూపించినప్పటికీ, పాక్ మీడియాలో మాత్రం విజయోత్సవాలే హైలైట్ అయ్యాయి. మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది వంటి ప్రముఖులు కూడా వీటిలో పాల్గొనడం గమనార్హం. కానీ ఉప ప్రధాని చేసిన తాజా వ్యాఖ్యలు ఆ దేశ అధికారిక వెర్షన్‌కి భిన్నంగా ఉండటంతో, పాక్ ప్రభుత్వం లోపలే అసలు పరిస్థితిపై స్పష్టతలేమి ఉన్నట్లు తెలుస్తోంది.