భారత్-పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, టర్కీ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ పరిణామాల మధ్య ‘బ్యాన్ టర్కీ’ అనే ఉద్యమం దేశంలోని పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఈ ఉద్యమం స్పష్టంగా ప్రభావం చూపుతోంది. అక్కడి వ్యాపారులు తమ వ్యాపారాలకు దేశభక్తిని ప్రాతినిధ్యం చేస్తూ టర్కీ నుండి దిగుమతి అయ్యే యాపిల్స్‌ను పూర్తిగా బహిష్కరించారు.
పుణెలో పండ్ల వ్యాపారులు టర్కిష్ యాపిల్స్‌ను ఇకపై విక్రయించబోమని ప్రకటించడంతో, మార్కెట్లలో అవి కనుమరుగయ్యాయి. ఈ నిర్ణయం కేవలం వ్యాపారులదే కాదు. స్థానిక ప్రజలు కూడా ఇందులో భాగమవుతూ, టర్కీ యాపిల్స్‌కు బదులుగా స్వదేశీ లేదా ఇతర దేశాల యాపిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ బహిష్కరణ నిర్ణయం పుణె పండ్ల మార్కెట్‌పై ఆర్థికపరంగా గణనీయమైన ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి.
సాధారణంగా టర్కీ యాపిల్స్ వ్యాపారం ద్వారా సీజన్ కాలంలో సుమారు రూ.1000 కోట్ల నుంచి రూ.1200 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇప్పుడు వ్యాపారం నిలిచిపోవడంతో ఆ మొత్తంలో తగ్గుదల అనివార్యమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక వ్యవహారం కాదు, దేశ భద్రతను కాపాడే భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతుగా తీసుకున్న దేశభక్తియుత నిర్ణయం అని వ్యాపారులు గర్వంగా చెబుతున్నారు.
టర్కీ యాపిల్స్‌ను ఇకపై కొనవద్దని నిర్ణయించామని పుణెలోని ఏపీఎంసీ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేసే సుయోగ్ జెండే తెలిపారు. దానికి బదులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే యాపిల్స్‌ను వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది తమ బాధ్యతగా భావిస్తూ దేశానికి మద్దతుగా తీసుకున్న చర్య అని తెలిపారు. టర్కీ యాపిల్స్‌కు వినియోగదారుల డిమాండ్ సగానికి తగ్గిందని మరో వ్యాపారి వెల్లడించారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. టర్కీ విధానాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, టర్కీ ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమం మరింత వేగం పెంచుకుంటోంది.