పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నగరాల్లో భద్రతాపరమైన ఉద్రిక్తతల కారణంగా, దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ కదలికల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు మంగళవారం పలు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ వంటి సరిహద్దు నగరాలకు విమాన రాకపోకలను నిలిపివేయాలని విమాన యాన సంస్థలు నిర్ణయించాయి.‘‘తాజా భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకే మాకు ప్రాముఖ్యత. పరిస్థితులను సమీక్షిస్తూ, అవసరమైతే మరిన్ని అప్‌డేట్‌లు ప్రకటిస్తాం’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది. ‘‘ప్రయాణికుల ప్రణాళికలకు అసౌకర్యం కలిగించినా, భద్రతకు మేము ప్రాధాన్యం ఇస్తాం. శ్రీనగర్, లేహ్, జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, రాజ్‌కోట్ నగరాలకు మా సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. అసౌకర్యానికి క్షమించండి’’ అని ఇండిగో పేర్కొంది.
భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సోమవారం రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించాయని చెబుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఓ నిఘా డ్రోన్‌ను భారత బలగాలు కూల్చివేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం కూడా మధ్యలోనే తిరిగి వెనక్కి మళ్లింది. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ, భద్రతా పరిస్థితులపై సమీక్ష కొనసాగుతోంది.