- కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన సీఎం కామెంట్స్
- చెవిలో ఎవరు చెప్తున్నారు మైక్ లో ఎవరు చెప్తున్నారు అనే అంశంపై చర్చ
- అంతా ఓపెన్ సీక్రెట్ అంటున్న నేతలు
- మీనాక్షి ఒక్కరోజు పర్యటనలో అనేక వాదనలు
- పదవులు ఇవ్వకుండా పనులు ఎలా చేస్తాం అంటున్న నేతలు
కాంగ్రెస్ పార్టీలో అంతా ఓపెన్ గానే ఉంటుంది. విమర్శలైనా ప్రశంసలైన ఆస్థాయిలోనే ఉంటాయి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీలో ఉన్న నేతల స్టైల్ మాత్రం అదే విధంగా ఉంటుంది. అయితే తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాత పద్ధతుల కారణంగా కొత్త సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ పాత పద్దతిపైన స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే వాటిని చెవిలో చెప్తున్నారని… ఎక్కడైనా విమర్శలు ఉంటే మాత్రం దాన్ని మైక్ లో చెప్తున్నారని రేవంత్ రెడ్డి నిన్న శుక్రవారం జరిగిని పీసీసీ విస్తృత స్ధాయి సమావేశంలో కామెంట్ చేశారు. కరెక్టే ప్రస్తుతం కాంగ్రెస్ లో అలాంటి పరిస్థితే ఉంది. సీనియర్ల నుంచి మొదలుకొని జూనియర్ల వరకు కొందరు ఈ మధ్య చేస్తున్న కామెంట్స్ ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. తీన్మార్ మల్లన్న నుంచి మొదలుకొని పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వరకు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి పర్యటన సందర్భంగా ఈ విషయం మరోసారి బహిర్గతమైంది. కొంతమంది నాయకులు ప్రస్తుత ప్రభుత్వ విధానాన్ని బహిరంగంగానే విమర్శించారు. హైడ్రా ఏర్పాటు వల్ల కొంత వ్యతిరేకత వస్తుందని స్వయంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. పార్టీలో సీనియర్ జూనియర్ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవడం లేదని విమర్శించారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ఏమీ కొత్త కానప్పటికీ గతంలో ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు తేడా చాలా ఉంది. గతంలో సోషల్ మీడియా అంతగా యాక్టివ్ గా లేదు. ఇప్పుడు ఎవరు ఎక్కడ చిన్న సమావేశంలో కామెంట్ చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి కామెంట్స్ అధికార పార్టీ నేతలే చేయడం వల్ల విపక్షాలకు అవి ఆయుధాలుగా మారుతున్నాయి.
మీనాక్షి నటరాజన్ చెప్పిన సూచనల విషయంలో కూడా పార్టీలో భిన్నమైన చర్చ జరుగుతోంది. పదవుల విషయంలో కూడా తమకు అన్యాయం జరుగుతోందని చాలామంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన వాళ్లకి కూడా ఇప్పటివరకు ఒక్క పదవి కూడా రాలేదని వాళ్ళంతా గాంధీభవన్ కు ప్రతిరోజు వచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నా గుర్తింపు లభించడం లేదని కొందరు అంటున్నారు. పదవుల పంపకాలకు సంబంధించి మీనాక్షి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు.
పార్టీలో క్రమశిక్షణ లేకపోతే రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కామెంట్స్ చేశారు. తనక్కూడా చాలా విషయాల్లో అసంతృప్తి ఉందని అలా అని పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా ఎవరూ చేయవద్దని ఆయన సూచించారు. తన ఒక్కరోజు పర్యటనలో మీనాక్షి నటరాజ్ అనేక సూచనలు సలహాలు చేశారు. వాటన్నిటినీ అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పీసీసీ పై ఉంది. అయితే ఇవన్నీ చేయాలంటే ముందుగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా పార్టీ ప్రభుత్వపరమైన పోస్టులను భర్తీ చేయాలని నాయకులు కోరుతున్నారు. అన్ని సెట్ చేయకుండా అంతా మంచే జరగాలని అనుకుంటే అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది.