- తీన్మార్ మల్లన్న పై వేటు
- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్
- మీనాక్షి నటరాజన్ డైరెక్షన్లోనే యాక్షన్
- ఎవరిని ఉపేక్షించవద్దని క్లారిటీ ఇచ్చిన మీనాక్షి
- ఏ స్థాయిలో ఉన్న ఇకపై యాక్షన్ తప్పదు అన్న పిసిసి చీఫ్
- త్వరలో మరికొందరు నేతలపై యాక్షన్
తెలంగాణ కాంగ్రెస్ లో యాక్షన్ మొదలైంది. క్రమశిక్షణ విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చింది. మీనాక్షి నటరాజన్ వచ్చిన మరుసటి రోజే క్రమశిక్షణ తప్పిన నేతలపై వేటు ప్రారంభమైంది. చాలా కాలం నుంచి వివాదాస్పదమైన నేతగా మారిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.
శుక్రవారం జరిగిన పార్టీ విస్తృత స్ధాయి సమావేశంలో పార్టీ నేతలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిసింది. లైన్ దాటి నేతలు ఏ స్థాయిలో ఉన్న ఏ హోదాలో ఉన్న సస్పెన్షన్ వేటు వేయాల్సిందేనని ఆమె క్లారిటీ ఇచ్చినట్టుగా తెలిసింది. అధిష్టానం నుంచి క్లారిటీ రావడంతో శనివారం రోజు తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ క్రమశిక్షణ చైర్మన్ చిన్నా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించిన ఆయన తన వైఖరిని మార్చుకోలేదని అందుకోసమే యాక్షన్ తీసుకున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందినీ… మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పని మహేష్ గౌడ్ అన్నారు. ఇలాంటి విషయాల్లో సహించవద్దని అధిష్టానం తెలిపినట్లుగా మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం అని ఆయన హెచ్చరించారు. ఇక తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే మద్దతు పలికారు. ఆ తర్వాత అనేక పార్టీలు మారుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. పార్టీ మొత్తం పని చేసి ఆయన్ను గెలిపించింది. అయితే గెలిచిన తరువాత వివిధ సందర్భాల్లో ఆయన మంత్రులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీసీ కుల గుణనకు సంబంధించి ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్వయంగా రాహుల్ గాంధీ డైరెక్షన్లో కుల గణన జరుగుతుంటే దానిని విమర్శించడమే కాకుండా తన యూ ట్యూబ్ ఛానల్లో జరిగిన ఓ లైవ్ కార్యక్రమంలో కులగణన పత్రాలను చించివేశారు. అంతేకుండా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేస్తూ ప్రకటనలు చేయడం పై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. కొద్దికాలం వేచి చూసిన అధిష్టానం ఇక ఊరుకుంటే మిగతా నేతలు కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తూ పార్టీకి ఇబ్బందికరంగా మారతారని వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజాగా తీన్మార్ మల్లన్న పై సస్పెన్షన్ వేటుతో మిగతా నాయకులు సైలెంట్ అవుతున్నారు. లైన్ దాటితే యాక్షన్ కఠినంగా ఉంటుందని క్లారిటీ రావడంతో వివాదాస్పదమైన కామెంట్స్ కి దూరంగా ఉండాలని నేతలు భావిస్తున్నారు.