- ఢిల్లీలో మలుపులు తిరుగుతున్న తాగు నీటి యుద్ధం
- ఎన్నికల అజెండాగా మారిన తాగు నీరు
- ఢిల్లీ ప్రజలకు విషం సప్లయ్ చేస్తున్నారన్న కేజ్రీవాల్
- యమునా నది కాలుష్య కాసారంలా మారింది
- హర్యానాలో బీజేపి పవర్ లో ఉండటమే కారణమన్న కేజ్రీవాల్
- నేను అదే నీటిని తాగుతున్నానన్నమోడీ
- ఆ నీటినే తాగి చూపించిన హర్యానా సీఎం
- కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేస్తామన్న సీఎం
- కేజ్రీ ఓ లిక్కర్ స్కామ్ రారాజు అన్నరాహుల్
తాగునీరు ఢిల్లీ ఎన్నికల ప్రధాన అజెండాగా మారిపోయింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపి తరపున మోడీ, అమిత్ షా తాగునీటి అంశంపై మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఢిల్లీలో తాగునీటి సరఫరా కీలకమైన ఎన్నికల అజెండాగా మారింది. ఆప్ అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో తక్కువ ధరలకే తాగు నీరు అందించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కాలంలో నీటి బిల్లులు తడిసి మోపెడవడంతో జనంలో వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడది ఎన్నికల అజెండాగా మారింది. ఈసారి ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ సురక్షిత మంచినీరు అందిస్తామని వాగ్దానం చేశారు. మరోవైపు బీజేపి యమునా నదిని క్లీన్ చేస్తామని వాగ్దానం చేసింది. ఢిల్లీకి తాగునీరు సరఫరా అవుతున్నది యమునా నది నుంచే కావడంతో అది ఎన్నికల అజెండాగా మారిపోయింది.
ఢిల్లీ ప్రజలకు విషం ఇస్తున్నారు… కేజ్రీవాల్
ఢిల్లీలో తాగు నీరు పేరుతో విషం సప్లయ్ చేస్తున్నారని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడ్డారు. ఢిల్లీకి యమునా నది నుంచి సప్లయ్ అవుతున్న తాగునీటిలో అమ్మోనియా కంటెంట్ ప్రమాదకర స్థాయిలో ఉందని, అది విషంతో సమానమని ఆరోపించారు. ఈ నీటి వల్ల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కూడా పాడైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గానీ, ప్రధాని మోడీ కానీ లేదా బీజేపి నేతలు కానీ ఈ నీరు మీడియా ముందు బాహాటంగా తాగి చూపించాలని సవాల్ విసిరారు. ఢిల్లీ ప్రజలకు తాము నిరంతరాయంగా అందిస్తున్న తాగునీటి సరఫరాను అడ్డుకోడానికి వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను పనిచేయనివ్వకుండా చేస్తున్నారన్నది ఆయన ఆరోపణ. ఢిల్లీ ప్రజలకు తాగు నీరు దూరం చేయాలన్న మహాకుట్ర బీజేపి చేస్తోందన్నారు. యమునా నీటిలో అమ్మోనియా స్థాయి అసాధారణంగా 7 పీపీఎం ఉందని, ఇలా ఉండటం విషంతో సమానమని అన్నారు. ఇంత ఎక్కువ మోతాదులో అమోనియా కాలుష్య నీటికి వాటర్ ప్లాంట్లు కూడా పాడైపోతాయన్నారు. తాగు నీటి కాలుష్యానికి బీజేపి ఎలా కారణమన్న ప్రశ్నకు బీజేపి పాలిత హర్యానాలోని పానిపట్ నుంచే యమునా నీరు వస్తోందని కాబట్టి బాధ్యత వారిదేనని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. అంత కలుషిత నీటిని శుద్ధిచేయడానికి క్లోరినేట్ చేస్తే అది విషంగా మారుతుందని జలమండలి బోర్డు సిఈవో లేఖను కూడా మీడియాముందు పెట్టారు.
బీజేపి ఘాటు కౌంటర్
కేజ్రీవాల్ ఆరోపణలకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, ఇతర నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను ఢిల్లీలో యమునా నీటినే తాగుతున్నానని మోడీ రిప్లయ్ ఇస్తే హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఢిల్లీ శివార్లలోని పల్లా గ్రామంలో యమునా నదిలో నీటిని అప్పటి కప్పుడు తాగి చూపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేస్తామన్నారు.
లిక్కర్ స్కామ్ రారాజు కేజ్రీ… రాహుల్
కేజ్రీవాల్ ఆరోపణలను రాహుల్ గాంధీ కూడా తిప్పి కొట్టారు. వాగన్ ఆర్ కారులో వచ్చి ఢిల్లీ ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన ఈ సామాన్యుడు అసామాన్య లిక్కర్ స్కామ్‌కు తెరతీసి రాజకీయాలను భ్రష్టు పట్టించాడు. 45 కోట్ల అద్దాల మేడ కట్టుకుని, ప్రజాసేవ కబుర్లు చెబుతున్నాడంటూ రాహుల్ దుయ్యబట్టారు. అయితే కాంగ్రెస్, బీజేపి తనపై ఒకే రకమైన ఆరోపణలు చేస్తుండటంతో ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని కేజ్రీ ఆరోపిస్తున్నారు.