రెవెన్యూ శాఖ ఉద్యోగి అని ఫేక్ ఐడీ కార్డుతో సచివాలయంలో హల్చల్ చేస్తున్న ఓ వ్యక్తిని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్రావు అనే వ్యక్తి రెవెన్యూశాఖ ఉద్యోగిగా నకిలీ ఐడెంటిటీ కార్డు వేసుకుని సెక్రటేరియేట్లో సంచరించడం భద్రతా సిబ్బంది గుర్తించింది. సెక్రటేరీయట్ సీఎస్ఓ దేవీదాస్ ఆదేశాలతో ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పూర్తి ఆధారాలు సేకరించి వలపన్నిపట్టుకున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ డ్రైవర్ రవి ఫేక్ ఐడీ తయారు చేసి భాస్కరావుకి ఇచ్చినట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా ఫేక్ ఐడి కార్డు తో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవిలపై ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, సెక్రటేరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంది? వీరికి ఎవరు సహకరించారు? వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. సెక్రటేరియట్ లో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని,ఫైల్ క్లియర్ చేయిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసున్నట్లు భస్కరరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.