- బిక్కు బిక్కు మంటున్న భారతీయులు
- స్వదేశం రాలేరు… అక్కడ ఉండలేరు…
- చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్ ప్రోసెస్ కు భారత్ దన్ను
- అక్రమ వలసదారులు దెబ్బ తినాల్సిందే
- అక్రమ వలసల్లో భారత్ ది మూడో స్థానం
- ట్రంప్ కరుణ కోసం వేలాది మంది ఎదురు చూపులు
- మోడీ టూర్ తో మిరాకిల్ జరుగుతుందా?
- అక్రమ వలసదారుల్లో గుజరాతీలే అధికం
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి అమెరికాలో అక్రమంగా ఉంటున్న లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ట్రంప్ ఎప్పుడు పొమ్మంటాడా అని ప్రాణాలు అరచేతిలో ఉగ్గబట్టుకుని బెదురు చూపులు చూస్తున్నారు. చివరి నిమిషంలో ఏదైనా మిరాకిల్ జరిగి ట్రంప్ మనసు మార్చుకోడా, మెత్తబడడా అని కొంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు. చాలా మంది ప్రధాని మోడీ అమెరికా పర్యటనకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మోడీ చర్చలు జరిపి మధ్యే మార్గంగా ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారేమో ట్రంప్ మనసు మారుస్తారేమోనన్నది మరికొందరి చివరి ఆశ.
ఎందుకంటే డాలర్ డ్రీమ్స్ అందరికీ ఉన్నాయ్. అమెరికాలో సాధ్యమైనంతగా సంపాదించి ఆపై ఇండియా వచ్చి స్థిరపడాలనుకుని వెళ్లినవారు, చదువులకోసం వెళ్లినవారు, సంపాదన కోసం వెళ్లినవారు, వ్యాపారాల కోసం వెళ్లిన వారు అందరూ ఇప్పుడు ధర్మ సంకటంలో పడ్డారు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి స్వదేశంలో ఆస్తులు అమ్ముకుని అమెరికా విమానం ఎక్కిన వారంతా ఇప్పుడు చేసిన అప్పులు తీరక, వెర్రిమొఖం వేసుకుని వెనక్కు రాలేక నానా అగచాట్లు పడుతున్నారు. విద్యావంతులు, పై చదువుల కోసం వెళ్లినవారు హెచ్ వన్ బీ వీసా, ఎల్ వన్ వీసాలపై అక్కడ ఏళ్ల తరబడి ఉంటున్నారు. ఇప్పుడు వారంతా తమకు చట్టబద్ధత కల్పించుకుని అంటే పౌరసత్వం తీసుకుని మాత్రమే అక్కడ ఉండాలి. లేదా వెనక్కు వచ్చేయాలి. ఈ పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు దొరకడం అంత ఈజీ కాదు. ఇప్పటికే లక్షల మంది గ్రీన్ కార్డు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వారందరికి పూర్తయ్యాకే ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి గ్రీన్ కార్డు దొరికేది. అలాగే సిటిజన్ షిప్ విధానానికి ట్రంప్ ముకు తాడు వేశారు. తల్లి దండ్రులిద్దరిలో ఒకరయినా అమెరికన్ అయి ఉండాలని, లేదా కనీసం అమెరిన్ సిటిజన్ షిప్ ఉండాలని షరతు పెట్టారు. దీంతో లక్షలాది మంది వెనుదిరగక తప్పని పరిస్థితి. ఫిబ్రవరి 20 తర్వాత ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. అయితే అంతకుముందే గౌరవంగా వెనక్కు వెళ్లిపోమని ట్రంప్ సూచించారు. దీంతో అమెరికాలో ఉంటున్న లక్షలాది భారతీయులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు.
అక్రమవలసల్లో మనది మూడో స్థానం
మెక్సికో, సెంట్రల్ అమెరికా దేశాలు కూడా ట్రంప్ నిర్ణయం వల్ల భారీగా దెబ్బతినబోతున్నాయి. ప్యూ రిసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం 2022 నాటికే అమెరికాలో ఏకంగా 7 లక్షల మంది సరైన డాక్యుమెంట్లు లేకుండానే అక్కడ కొనసాగుతున్నారు. ఇలాంటి అక్రమ వలస దారుల జాబితాలో మెక్సికో, సాల్వెడార్ దేశాలు ఒకటి రెండు స్థానాలు ఆక్రమిస్తే మనదేశం మూడవది. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో కొందరు చట్టపరమైన మార్గాల్లో వీసా పొంది ఉంటుండగా, చాలా మంది సరిహద్దులు దాటి అక్రమంగా ప్రవేశించినవారే. 2023లో సరైన పత్రాలు లేకుండా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన 90 వేలమంది భారతీయులను అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసింది కూడా.
అందరి ఆశలూ మోడీ పైనే..
ఈమధ్య కాలంలో భారత, అమెరికా దేశాల మధ్య రక్షణ, సాంకేతిక రంగాలతో పాటు, వాణిజ్య రంగంలోనూ సంబంధాలు బలపడ్డాయి. ఈ కారణంగానే అమెరికన్ ఫస్ట్ అంటూ ట్రంప్ మోగించిన నినాద ప్రభావాన్ని గట్టిగా ఎదుర్కొనగలమని విశ్లేషకులు అంటున్నారు. అదీకాక మోడీకి, ట్రంప్ కు మధ్యనున్న బంధం కూడా ప్రత్యేకమైనది. ట్రంప్ రెండోసారి గెలిచాక మోడీ ఫోన్ చేసి అభినందించినప్పుడు ట్రంప్ బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఏదో మేలు జరగకపోదన్న ఆశ భారతీయుల్లో ఉంది. అదీకాక ఇల్లీగల్ మైగ్రేషన్ సమస్యను ఎదుర్కొనే విషయంలో భారత్ అమెరికాకు సహకరిస్తుందని కూడా ట్రంప్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే చివరి ఆదేశాలకు రెడీగా ఉన్న 19 వేలమంది భారత అక్రమ వలసదారులను భారత్ వెనక్కి రప్పిస్తోంది. దీన్ని బట్టి చూస్తే చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని పరిరక్షించుకునే ఉద్దేశంతోనే భారత్ అడుగులేస్తోంది. దీనివల్ల స్కిల్డ్ వర్కర్ వీసా దారులందరూ ఊపిరి పీల్చుకోవచ్చు. అక్రమ వలసదారులకు చెందిన దేశాలన్నింటిపైనా టారిఫ్ లు విధిస్తున్న ట్రంప్ మన దేశంపై ఆ విధానం అనుసరించే అవకాశం లేదు.
ప్రపంచంలో శక్తివంతమైన నేతల్లో ఒకరిగా మోడీ పేరుతెచ్చుకున్నారు. ఆర్థిక పురోగతికి చుక్కానిగా ఆయన్ను ప్రపంచం కీర్తిస్తోంది. ప్రపంచ పారిశ్రామిక పటంపై చైనాకు భవిష్య ప్రత్యామ్నాయంగా భారత్ ను అమెరికా పరిగణిస్తోంది. అయితే మోడీ నాయకత్వ పటిమ ఎంత గొప్పగా ఉన్నా మన దేశంనుంచే ఎక్కువమంది సంపాదన కోసం అమెరికాకు వెళ్తున్నవారున్నారు. పైగా గుజరాత్ నుంచే ఎక్కువమంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారన్నది మరో నిజం.
గుజరాత్ వారే అత్యధికం
గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఇంటికొకరు సక్రమంగానో, అక్రమంగానే అమెరికాలో ఉన్నారు. వీరంతా ఏడాదికొకసారి ఇండియా వచ్చి తమ వారి దగ్గర హాజరు వేయించుకుని వెళ్లిపోతున్నారు. అదీకాక మెహసానా జిల్లా వారే ఎక్కువ మంది అక్రమ మార్గాల ద్వారా అమెరికాలోకి వెళ్లేందుకు సరిహద్దు గోడలు ఎక్కి, బోట్లలో ప్రయాణించి, శీతాకాలం గడ్డ కట్టే మంచులో నడుచుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారే. అసలు గుజరాతీలకు అమెరికా పయనం అంటే ఒక స్టేటస్ సింబల్. చాలా మంది గుజరాతీలకు ఈ మోజులో పెళ్లిళ్లు కూడా జరగడం లేదు. అమెరికాలో ఉండే భాగస్వామి దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అక్రమ వలస రూట్లు ఇవే..
భారతీయులు అమెరికాలోకి వెళ్లేందుకు పొరుగున ఉన్న మెక్సికో ముందు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి అక్రమ మార్గాల్లో అమెరికాలోకి చొరబడి అధికారులకు పట్టుబడి ఆపై నెలల సమయం జైలు శిక్ష అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఇంత జరిగాక వెనక్కు రాలేరు. తమ వారి ముందు పరువు పోతుందన్న భయం. అందుకే అక్కడే ఏదో ఒక హోటల్ లో షాపింగ్ మాల్ లో, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.వారిని అమెరికా పంపేందుకు పొలాలు, ఇళ్లు, ఆస్తులు అమ్ముకుని ఇక్కడ తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నారు.
60వ దశకం నుంచే వలసలు
మనదేశంలో 1960 నుంచే ఈ అమెరికా వలసలు మొదలయ్యాయి. అప్పట్లో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ చాలా సరళంగా ఉండేవి. ఆ తర్వాత కాలంలో అమెరికా లైఫ్ పై ఒక క్రేజ్ మొదలైంది. అదికాస్తా వ్యసనంగా మారింది. అయితే బైడెన్ పాలనలో అక్రమ వలసల పై ఉక్కు పాదం మోపడం మొదలైంది. ట్రంప్ హయాంలో అది పతాక స్థాయికి చేరుకుంది.అసలు మనదేశంలో మధ్యతరగతివారు ఈఅమెరికా మోజులో ఎక్కువ చిక్కుకుంటున్నారు. అప్పో సొప్పో చేసి తమ పిల్లలను పై చదువులకు వీసాలపై పంపడం, ఒకసారి వెళ్లిన వారు వీసా గడువు దాటిపోయినా అక్కడే ఉండేందుకు ప్రయత్నించడం అలవాటుగా మారింది. అమెరికాలోకి నేరుగా ఎంట్రీ దొరకని వారు విజిటర్స్ వీసా ద్వారా ఆ చుట్టు పక్కల దేశాలకు వెళ్లడం అక్కడనుంచి సరిహద్దులను దాటడం లేదా, సముద్రమార్గంలో చేరుకోవడం చేస్తున్నారు. ఇంకా దౌర్భాగ్యమేమంటే అమెరికాలో ఉంటున్న తమ పిల్లలు అక్కడే ఉండి బాగా సంపాదించి తమను కూడా తీసుకు వెళ్లాలని చాలా మంది తల్లి దండ్రులు కలగంటుండటం. వీరందరి ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశం లేకపోయినా ఫిబ్రవరిలో జరిగే మోడీ టూర్ ఏదైనా అద్భుతాలకు దారి తీస్తుందే అనే చివరి ఆశ లక్షలాది మంది భారతీయుల్లో ఉంది.