ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత సంపూర్ణంగా నేను తీసుకుంటానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. శనివారం నాగార్జునసాగర్ లో జరిగిన ఆదివాసీ, గిరిజన ప్రజా ప్రతినిధుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో డిప్యూటీ సీయం మాట్లాడుతూ సబ్ ప్లాన్ చట్టం సర్వరోగ నివారిణి అని అభివర్ణించారు. హక్కులను స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వాలే తీసుకువచ్చాయని తెలిపారు. ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ కి సంబంధించి తాను చీఫ్ విప్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చి తూచా తప్పకుండా అమలు చేయాలని కోరామని గుర్తు చేశారు. ఆ తర్వాత తాను డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఆమోదం పొందిందని తెలిపారు. ఈ చట్టాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా, బిల్లును ఆమోదింప చేసిన వ్యక్తిగా నాకు సంపూర్ణ అవగాహన ఉంది.. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, అమలు చేసే బాధ్యత తనపై సంపూర్ణంగా ఉందని తెలిపారు. అన్ని శాఖల సెక్రటరీలను సమావేశపరచి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధుల కేటాయింపు జరుగుతుందా? లేదా? అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించానని. ఇప్పటికే రోడ్లు ,భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదిక సమర్పించారని, మిగిలిన వారితో నివేదికలు తెప్పించి త్వరలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తానని భట్టి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 10 శాతం నిధులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే… రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉండటంతోనే సబ్ ప్లాన్ చట్టం అమలు చేయగలుగుతున్నామని ప్రజల్లో గట్టిగా ప్రచారం చేయాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులను డిప్యూటీ సీఎం కోరారు. ఐటీడీఏలను పునర్జీవింప చేస్తామని, వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయించి నిరుద్యోగులకు శిక్షణ కల్పించి స్వయం ఉపాధిని కల్పిస్తామని అన్నారు. ఈ దేశ సంపద, వనరులు ఇక్కడి ప్రజలకే దామాషా ప్రకారం అందాలి తప్ప కార్పోరేట్ శక్తులకు కాదు అన్నారు. భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, రాజ్యాంగం ద్వారా సామాన్యులు పొందిన హక్కులను కాలరాసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరినీ రక్షిస్తుంది, రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ నడుము బిగించారు సంవిధాన్ సమ్మేళన్ పేరిట ఆయన దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, పార్టీ శ్రేణులు రాజ్యాంగ రక్షణకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పీసా చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని వంద శాతం సంపూర్ణంగా అమలు చేస్తాం అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పాదయాత్రలో ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుందని ఇల్లు లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు చెప్పాను. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో హక్కులు కాదు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయాం అని రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు అని అన్నారు. పది సంవత్సరాలుగా ఇల్లు లేని పేదలకు 22,500 కోట్లు ఖర్చుపెట్టి మొదటి దశలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లు నిర్మించనున్నామని పేర్కొన్నారు. ఐదు లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఒక లక్ష రూపాయలు జత చేసి ఆరు లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించనున్నామని తెలిపారు. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అందించబోతున్నామన్నారు. సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా కింద జనవరి 26 నుంచి 12,000 జమ చేయబోతున్నాం. కాంగ్రెస్ వస్తే రైతు భరోసా ఉండదని బి ఆర్ ఎస్ నేతలు ప్రచారం చేశారు కానీ మేము 10 వేలకు మరో రెండు వేలు కలిపి 12000 రైతుల ఖాతాలో జమ చేయబోతున్నామన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన భూముల్లో విద్యుత్ సౌకర్యం పొందేందుకు లైన్లో వేసే క్రమంలో అటవీ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఆ భూముల్లో సోలార్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, మోటార్ల ద్వారా ఆయా భూములు సాగులోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు .సౌర శక్తి ఉత్పత్తికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.