పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలకు విస్పష్టమైన హామీ ఇచ్చారు. బుధవారం తాడేపల్లి వైసీపీ ప్రధానకార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నాయకులతో జగన్ భటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ కార్యకర్తలను ఒకలా చూశామని… ఇకనుంచి మరోలా చూసుకుంటామని జగన్ భరోసా కల్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. మన ప్రభుత్వంలో ఇచ్చిన పధకాలను రద్దు చేశారని ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోందని నెల్లూరు జిల్లా నేతలకు వైఎస్‌జగన్ వివరించారు. సాధారణంగా ప్రభుత్వాలపై వ్యతిరేకత రావడానికి సంవత్సర కాలమైనా పడుతుందని కానీ కూటమి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ వారికి చెప్పారు. ఎన్నికల ముందు చాలా మంది వచ్చి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నన్నుకూడా ఇవ్వమని సలహాలు ఇచ్చారని కానీ అలవికాని హామీలు ఇచ్చి వ్యక్తత్వం, విశ్వసనీయత తెబ్బతీసుకోవడం నాకు ఇష్టం లేదన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేయలేడని, అవన్నీ అమలు చేయాలంటే 1.72 లక్షల కోట్లు ఖర్చు చెయ్యాలని, అది అసాధ్యమని ప్రజలకు చెప్పానని జగన్ గుర్తు చేశారు. మనం ఉన్నప్పుడు ప్రతి నెలా ఏదో ఒక పథకంతో ప్రజల చేతిలో డబ్బులు ఉండేలా చేశామని, కేవలం ముఖ్యమంత్రి మారినందుకే ఇప్పుడు ఆ పథకాలేవీ అమలవ్వడం లేదని జగన్ చెప్పారు. ఇంటివద్దకే డోర్ డెలివరీ చేసిన రోజుల నుంచి ఇప్పుడు ఏది కావాలన్నీ టీడీపీ నాయకుల ఇళ్లవద్ద పడిగాపులు కాసే పరిస్ధితి వచ్చిందన్నారు. ఈ సమయంలో మనం ప్రజలకు తోడుగా ఉండాలన్నారు. పార్టీని వ్యవస్ధీకృతంగా తీర్చిదిద్దాలని, ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చెయ్యాలని పార్టీ నేతకు సూచించారు. సంక్రాంతి పండుగ తరవాత నెలఖరు నుంచి గానీ ఫిబ్రవరి నెల నుంచి కానీ జిల్లాల పర్యటనలకు వస్తానని కార్యకర్తలందరినీ కలుస్తానని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు.
- Advertisement with us -