26.2 C
Hyderabad
Friday, September 18, 2026

Live Video

spot_img

ఇంటర్‌లో భారీ సంస్కరణలు – ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌ రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌లో భారీ మార్పులు చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఫస్టియర్‌ వార్షిక పరీక్షలను రద్దు చేయనున్నారు. నేరుగా సెకండియర్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ మాత్రమే నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే ఈ కొత్త నిర్ణయం వెనుక లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. పలు భారీ మార్పులు చేసేందుకు కూడా సర్కారు సిద్ధమవుతోంది.

వర్చే విద్యా సంవత్సరం నుంచే అంటే.. 2025-26 నుంచే ఫస్టియర్‌ వార్షిక పరీక్షల రద్దు నిర్ణయం అమలు చేయబోతున్నారు. ఈమేరకు ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే, ఇంటర్మీడియట్‌లో కొత్తగా ఎంబైపీసీ కోర్సును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్పులతో పాటు.. సెకండ్‌ సబ్జెక్టుగా అకడమిక్ సబ్జెక్టుల్ని ఎంచుకునే అవకాశం కూడా కల్పించ నున్నారు. గతంలో సెకండ్‌ లాంగ్వేజ్‌ మాత్రమే ఎంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏ గ్రూపులో అయినా అకడమిక్‌ సబ్జెక్టులను ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశాలకు నీట్‌, ఇంజనీరింగ్‌లో జేఈఈ వంటి పరీక్షలకు కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే, మొత్తం ఈ ప్రతిపాదనలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్‌మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించడం లేదు.అత్యధిక శాతం ఇంటర్ బోర్డులు, యూనివర్శిటీల్లో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆ మార్కులనే అర్హతగా పరిగణిస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ మార్పుల్లో భాగంగా ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ వార్షిక పరీక్షలను తొలగిస్తే మొదటి ఏడాది సిలబస్‌లో కీలక అంశాలపై పట్టు సాధించడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుందని, అలాగే,సెకండియర్‌ ఆలిండియా స్థాయి పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు అవసరమైన సామర్థ్యాలను పెంచుకుంటారని ఇంటర్‌బోర్డు అంచనా వేస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చివరిసారిగా సైన్స్‌ గ్రూపుల్లో సిలబస్‌ల సవరణలు జరిగాయి. 2021-13లో ఇంటర్‌ ఫస్టియర్ సిలబస్‌ మార్చగా, 2013-14లో సెకండియర్‌ సిలబస్‌ను మార్చేశారు. 2014-16 మధ్య కాలంలో ఆర్ట్స్‌ కోర్సుల సిలబస్‌ మార్చారు. 2018-20 మధ్య లాంగ్వేజ్‌ సిలబస్‌ను సవరించారు. ఇక, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న మార్పులకు సంబంధించి విద్యా రంగ నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేసిన వాళ్ల అధ్యయనం తర్వాత 2025-26 నుంచి ఇంటర్మీడియట్‌ విద్యలో ఎన్‌సిఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాలని కూడా ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో బోర్డు నిర్ణయించిన సిలబస్‌, బ్లూ ప్రింట్ ఆధారంగా వార్షిక పరీక్షలు ఇంటర్నల్‌గా నిర్వహిస్తారు. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో ఆ మార్కులను ఏమైనా పరిగణనలోకి తీసుకోవాలా, లేదా అన్న సంశయంపై చర్చ నడుస్తోంది.

ఇక, కొత్త ప్రతిపాదనలు అమలులోకి వస్తే.. మరిన్ని భారీ మార్పులు కూడా జరగనున్నాయి. దీని ప్రకారం ఇంటర్‌ పరీక్షల విధానంలో కూడా సమూల మార్పులు చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలను 500మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు. ఆర్ట్స్‌, సైన్స్‌ అన్ని గ్రూపుల్లో పరీక్షలను 500మార్కులకు పరిమితం చేస్తారు. ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లో సివిక్స్‌, కామర్స్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో 100 మార్కులకు 80మార్కులకు థియరీ పరీక్షల్ని నిర్వహిస్తారు. ప్రాజెక్ట్‌ వర్క్‌, పరిశోధనా కార్యక్రమాలకు మరో 20 మార్కులు కేటాయిస్తారు. ప్రతి కోర్సుకు గరిష్టంగా 500మార్కులకు మాత్రమే పరీక్షలు జరుగుతాయి. ఇక, ఎంపీసీ గ్రూపులో 380 మార్కులకు థియరీ పరీక్షలు నిర్వహిస్తాఆరు. 120 మార్కులను ఇంటర్నల్‌, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.ఎంపీసీ గ్రూపులో ఇంగ్లీష్‌కు 80 +20మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20మార్కులు, గణితం/జీవ శాస్త్రంకు 80+20మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయిన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్న్/ప్రాక్టికల్ తప్పని చేశారు. మొత్తం పరీక్షల్లో థియరీకి ఎంపీసీలో 380+120 సాధించాల్సి ఉంటుంది. బైపీసీ గ్రూపులో 370 మార్కులను థియరీ పరీక్షలకు నిర్వహిస్తారు. 130 మార్కులను ఇంటర్నల్‌, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.బైపీసీ గ్రూపులో ఇంగ్లీష్‌కు 80 +20మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20మార్కులు, గణితం/జీవ శాస్త్రంకు 80+20మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయిన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. అయితే, ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్‌, ప్రాక్టికల్ తప్పని సరి చేయనున్నారు. అంతేకాదు.. ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఏకపద సమాధానాలు వంటి వాటికి కూడా మార్కుల్ని ప్రతిపాదించారు. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు బదులు 5 లేదా 6 మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు.

అయితే, ఈ ప్రతిపాదనలపై అవసరమైన సూచనలు, సలహాలు చేయాల్సిందిగా ఇంటర్‌బోర్డు మెయిల్స్‌ ఆహ్వానిస్తోంది. biereforms@gmail.com మెయిల్‌కు అభిప్రాయాలను పంపాల్సి ఉంటుంది.వీటిపై ఎవరైనా సలహాలు, సూచనలను ఈనెల 26వ తేదీలోపు మెయిల్‌కు పంపాలని ఇంటర్‌బోర్డు ప్రకటించింది.విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలతో పాటు.. ప్రజలు ఎవరైనా సరే.. సూచనలు చేయాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కోరారు. ప్రతిపాదిత సంస్కరణల నమూనాలు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com