రష్యా, ఇరాన్,టర్కీ, ఇజ్రాయెల్.. ఎవరి స్వార్ధం వారిది..
సిరియా ఇప్పుడు పెనం మీంచి పొయ్యిలో పడిందా? అంటే అవుననే అనాలి. నియంత్రుత్వ తెరలు తొలగాయనుకుంటే రెబల్స్ ను నమ్మడానికి లేదు. ఐసిస్, ఆల్ కాయిదా లాంటి ఉగ్ర సంస్థలతో అంటకాగిన రెబల్స్ దేశాన్ని సురక్షితంగా ఉంచుతారన్న నమ్మకం లేదు.
దేశంలో ప్రజలకు రక్షణ లేదు. ఎవరిని నమ్మాలో తెలీదు. ఎవరిని వద్దను కోవాలో తెలీదు. దేశంలో నియంత పాలనకు, రెబల్స్ కు మధ్య అంతర్గత పోరం అంతర్యుద్ధంలా మారితే అందులో చలి కాచుకునేందుకు పొరుగు దేశాలన్నీ రెడీ అయిపోయాయి. ఎవరి స్వార్ధ రాజకీయాలు, విస్తరణ కాంక్ష, దురాక్రమణల మేరకు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.రష్యా, ఇరాన్, టర్కీ, ఇజ్రాయెల్ ఇలా చుట్టు పక్కల దేశాలన్నీ ఇష్టాను సారం వేలు పెట్టి కెలికే ప్రయత్నమే చేశాయి.బలమైన ప్రజాస్వామ్య పాలన లేకపోవడం, రాచరికపు పోకడలు, ముస్లిం వర్గాల మధ్య జాతి ఘర్షణలు అన్నీ సిరియాను సర్వ నాశనం చేసేశాయి. ఏఏ దేశం ఏం చేసిందంటే…
రష్యా ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా?
మధ్య ప్రాచ్య తీరంలో రష్యా ఆధిపత్యానికి చెక్ పడినట్లేనా? ఎందుకంటే ఇన్నాళ్లూ టార్టస్ లాంటి సిరియా నగరాల్లో వ్యూహాత్మకంగా నావెల్ బేస్ ను ఏర్పాటు చేసి నియంతకు సహకరిస్తూ వచ్చింది.అంతేకాదు లటాకియాలో ఎయిర్ బేస్ నిర్మించుకుని వాయుదాడుల్లో సిరియాకు సహకరిస్తూ మధ్య ప్రాచ్యం ని తన కంట్రోల్ లో ఉంచుకుంది.అటు ఆఫ్రికాను, మధ్యప్రాచ్య ప్రాంతాన్ని తన కనుసన్నల్లోకి తీసుకుంది.
కానీ ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధం అంతూ దరీ లేకుండా సాగడంతో రష్యా కూడా సిరియాపై ద్రుష్టి పెట్టలేకపోతోంది.
ఇరాన్ కూడా చేతులెత్తేసిందా?
సిరియాలో రెబల్స్ తిరగబడటంతో ఇరాన్ ఆధిపత్యానికి కూడా అడ్డుకట్టపడినట్లే. కారణం లెబనాన్లోని హెజ్బొల్లా ను కంట్రోల్ చేయడానికి సిరియా నుంచే ఇన్నాళ్లు ఆపరేషన్స్ నిర్వహించింది.ఆయుధాల రవాణాకు, సప్లయ్ కు ఈ మార్గం తమ అదుపులో ఉంచుకుంటేనే ఆ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించగలదు.మరోవైపు ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులు,హెజ్ బొల్లా బలహీనపడటం,యెమెన్,ఇరాక్ లపై ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ సతమతమవుతోంది.తమ ప్రాంతాన్ని రక్షించుకోడానికి,ఇజ్రాయెల్ పై వ్యూహాత్మక యుద్ధానికి ఇరాన్ ఇప్పుడు టైమ్ వెచ్చించాల్సి ఉంది. కాబట్టి సిరియా పరిణామాలను పట్టించుకునే తీరిక ఉండదు. తన ఆక్రమిత భూ భాగాలను రక్షించుకునే క్రమంలో ఇరాన్ కు సిరియా పై ద్రుష్టి ఉండదు.
టర్కీ కూడా అంతే..
గతంలో సిరియాలో అధ్యక్షునికి, రెబల్స్ కు మధ్య చర్చలు జరిగేలా మధ్యవర్తిత్వం వహించేందుకు టర్కీ కూడా చొరవ చూపింది. అధ్యక్షుడు అల్ బషర్ అసద్ ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. టర్కీ చేసిన అనేక ప్రయత్నాలను ఆయన తిప్పి కొట్టారు. అయితే టర్కీ ఈ ప్రతిపాదన చేయడం వెనక దాని స్వార్దం దానికుంది. సిరియా నుంచి లక్షల్లో శరణార్ధులు టర్కీలో తల దాచుకుంటున్నారు. వారిని భరించడం ఆదేశానికి కష్టం గా మారింది. పైగా శరణార్ధులతో పాటు ఉగ్రవాద మూకల భయం కూడా టర్కీకి ఉంది. కాబట్టి కాల్పుల విరమణ విప్పందం పాటించి రెబల్స్ ప్రభుత్వం ఒక తాటిపైకి వస్తే శరణార్దులను వెనక్కు పంపొచ్చని టర్కీ భావించింది. తద్వారా ఉత్తర సిరియా లో కుర్దు మిలీషియా నుంచి తమ దేశానికి ప్రమాదం తలెత్తకుండా సరిహద్దులు పటిష్టం చేసుకోవచ్చని ఊహించింది. కానీ నియంత బషద్అల్ అసర్ పడనివ్వలేదు.
ఇజ్రాయెల్ వ్యూహాత్మక వైఖరి?
సిరియాలో అధ్యక్ష పాలన అంతమొందడంపై ఇజ్రాయెల్ కు కొంత లాభం, కొంత నష్టం.అధ్యక్షుడు పారిపోవడంతో హెజ్ బొల్లాపై ఇరాన్ పట్టు కోల్పోవడం ఇజ్రాయెల్ కు కలిసొచ్చే అంశం. ఇన్నాళ్లు హెజ్బొల్లాకు సిరియా అధ్యక్షుడు ఇరాన్ ఆయుధాల రవాణాకు సిరియాయే అనుమతించింది. ఇప్పుడు హెజ్బొల్లా నుంచి ఇరాన్ సేనలు వెనుదిరగడం ఇజ్రాయెల్ కు అనుకూలించే విషయం.శత్రుదేశం ఇబ్బందుల్లో పడింది కాబట్టి.కానీ సిరియాలో ఉగ్రవాద మూకలకు మద్దతిచ్చే రెబల్స్ బలపడటం ఆందోళన కరమైన అంశం..అందుకే వ్యూహాత్మకంగా గోలన్ హైట్స్ లాంటి ప్రాంతాల్లో సరిహద్దుల పహారాను పెంచుకుంది.అంతేకాదు సిరియా లో అధికారం చేజిక్కించుకున్న రెబల్స్ సిరియా ఆర్మీ దాచుకున్న ఆహార నిల్వలు, వస్తు సముదాయాలపై దాడులు జరిపి కొల్లగొడితే మళ్లీ రణరంగమే అవుతుంది. ఈ కల్లోల వాతావరణాన్ని సాకుగా చూపి ఇరాన్ సేనలు మళ్లీ రెచ్చిపోయి ఆక్రమణలు జరిపే అవకాశం లేకపోలేదు.
అమెరికా ఐసిస్ లాంటి ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టినప్పటికీ సిరియాపై భవిష్యత్తులో ఎలాంటి వైఖరి వ్యక్తం చేస్తుందో చూడాలి. ఇజ్రాయెల్ దేశానికి దన్నుగా ఉన్న అమెరికా సిరియా సంక్షోభాన్ని స్వార్ధ ప్రయోజనాలకు వాడుకోదన్న గ్యారంటీ లేదు.
సిరియాలో జరిగిన ఈ అంతర్గత పరిణామాల నేపధ్యంలో భారతీయులెవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని మన విదేశాంగ శాఖ ప్రకటించింది.అంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.