తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు,ఏర్పాటుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసినట్టు వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నామన్నారు. ఉద్యమ కాలంలో స్ఫూర్తి నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని వివరించారు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టవకరమన్న రేవంత్ రెడ్డి…తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు…తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారని వెల్లడించారు.
దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదని, ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం ఆలోచన అనుకోవడం తప్పు అని నర్మగర్భంగా కెసిఆర్ ను విమర్శించారు. మధ్య యుగాల చక్రవర్తులు పాలనలా ఇవాళ నడవదని… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందన్నారు.
ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నామని తెలిపిన రేవంత్ రెడ్డి…ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దామని, ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందామని, ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందామన్నారు. ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారని, తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారన్నారు. అందుకే డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉందన్న సిఎం రేవంత్ రెడ్డి…అధికారికంగా ఇప్పటి వరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు…ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదని అన్నారు.