గత కొన్నేళ్ళ నుంచి ఉచిత రాజకీయాలు మనకు అలవాటు అయిపోయాయి. ఎన్నికలు వస్తే చాలు ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా నాయకులందరూ మాకు పగ్గాలు ఇస్తే మీకు అది ఫ్రీ…ఇది ఫ్రీ….అంటూ హామీలు గుప్పిస్తుంటారు. కర్ణాటక, తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఫ్రీ గ్యాస్, ఫ్రీ బస్సు రవాణా వంటి హామీలు ఇచ్చింది. రెండు చోట్ల సక్సెస్ అయ్యింది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కూటమి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది. ఓట్లు రాల్చుకుంది. కేంద్రం కోవిడ్ సమయంలో ఉచిత రేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూపాయికి, రెండు రూపాయలకు రేషన్ అని, డోర్ డెలివరీలని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చాలా ఏళ్లుగా చేస్తూనే ఉన్నాయి. ఇవి కాకుండా సామాజిక వర్గాల వారీగా ఏదో ఒక పథకం పేరు పెట్టి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ – పారదర్శకత అంటున్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇలా ఉచితాలు ఎంత కాలం ఇస్తూ వెళతారు అని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీ పై రేషన్ అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పిన సమాధానం విని సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు చర్చించాల్సిన, ఆలోచించాల్సిన కీలకమైన అంశం ఇది.
ఉచితాల చరిత్ర-
ఉతితాల సంస్కృతి తమిళనాడు రాష్ట్రం నుంచి మొదలయ్యింది. అప్పట్లో ఎమ్.జి.రామచంద్రన్ పేదలకు ఉచిత బియ్యం వంటి సంక్షేమ పథకాలు ఆజ్యం పోశారు. ఇదే ఫార్ములాను 1983లో ఎమ్జీఆర్ లానే వెండితెర నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఫాలో అయ్యారు. కూడు, గూడు, గుడ్డ అన్న నినాదానికి అప్పట్లో ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. నాటి ప్రజల ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి పథకాలతో ఎన్టీఆర్ మాస్ లీడర్ గా ఇమేజ్ తెచ్చుకున్నారు. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. దేశ ఆర్ధిక పరిస్థితి మారింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. గ్లోబలైజేషన్ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కప్పు టీ ఖరీదు పది రూపాయలు ఉన్న సమయంలో కిలో బియ్యం రూపాయికి రావాలని కోరుకునే పరిస్థితి లేదు. అయినా ఆ పాత మూస పద్ధతి ఉచిత బియ్యం విధానం నుంచి పార్టీలు బయటకు రావటం లేదు.
అనుకూల వాదన- కోవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన లక్షలాది మంది వలస కార్మికులు, పేదలు, బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? కనీసం తిండి గింజలైనా ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఈ వర్గాలు ఆకలితో అలమటించవా..? అన్న వాదనను అంగీకరించాల్సిందే. ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల వల్లే పేద వర్గాల కొనుగోలు శక్తి పెరిగి ఆర్ధిక వ్యవస్థ నిలబడింది అన్న మరో విశ్లేషణ కూడా ఒక కోణంలో వాస్తవమే. దశాబ్దాలుగా ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత, మైనార్టీ వర్గాలకు ఊతం ఇవ్వాలంటే ఉచిత లేదా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదా అన్నది మరో వాదన.
జరుగుతోంది ఏంటి…?
పేద వర్గాలకు చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉంటుంది. దీన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. కాని ఆ చేయూత ఏ రూపంలో ఇవ్వాలి, ఏ రూపంలో ఇస్తున్నారు అన్నదే కీలకమైన ప్రశ్న. మీరు పేద వాళ్లు…ఇంట్లోనే కూర్చొండి…మేమే మీకు రేషన్ ఇంటికి తీసుకుని వచ్చి ఇస్తాం. మహిళలు బస్సు ఎక్కితే ఫ్రీగా తీసుకుని వెళతాం. మీకు అరవై ఏళ్లు (ఏపీలో చంద్రబాబు బీసీ వర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం అని ఎన్నికల్లో హామి ఇచ్చారు) రాగానే మీ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు వేస్తాం అంటే సమాజాన్ని ఏ దిశగా రాజకీయ పార్టీలు తీసుకుని వెళుతున్నట్లు…? గతంలో జగన్ ప్రభుత్వం చేతికి ఎముక లేనట్లు సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. వాహన మిత్రా పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా పది వేలు, న్యాయవాదుల కోసం వైఎస్ఆర్ లా నేస్తం కింద నెలకు ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయం మచ్చుకు కొన్ని ఉదాహరణలు. జగనన్న విద్యా దీవెన, ఆసరా, కాపు నేస్తం ఇంకా ఈ జాబితా చాంతాడంత ఉంటుంది. ప్రభుత్వం మారినా పథకాలను తీసివేయలేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి న్యాయమిత్రగా పేరు మార్చింది. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి, 19 నుంచి 59 ఏళ్లు మహిళలకు నెలకు 1500 ఆర్ధిక సహాయం చంద్రబాబు ఇచ్చిన మరికొన్ని హామీలు. 60 ఏళ్లు రాగానే వృద్ధాప్య పెన్షన్. తెలంగాణాలోని రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీనితో ఆటో డ్రైవర్లకు ఆదాయం తగ్గింది. ఆటో డ్రైవర్ల ఆందోళనతో వారికి ఏటా 12 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది రేవంత్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ కు క్రెడిట్ వస్తుందేమో అని కంగారు పడిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏటా పదివేలు కాదు నెలకు 5వేల రూపాయల ఆర్ధిక సహాయం ఆటో డ్రైవర్లకు చేయాలని వారితో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంటే మొత్తం వ్యవస్థను ఈ రాజకీయ పార్టీలు ఎటు తీసుకుని వెళుతున్నారో ఈ ఒక్క ఉదాహరణతో అర్థం అవుతుంది. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించటానికి హామీలు గుప్పించటం, అధికారంలోకి వస్తే హామీలు నెరవేర్చలేక అప్పులు చేయటం, ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్రమైన భారం వేయటం అలవాటుగా మారిపోయింది రాజకీయ పార్టీలకు.
ఉచితాలు గెలిపిస్తున్నాయా…?
ఎన్నికల్లో ఉచితాల పేరుతో ఊదరగొడితే ప్రజలు పట్టం కడతారా? సంక్షేమ రాజ్యం అంటూ కోట్లాది రూపాయలను ప్రజల పై కుమ్మరిస్తే కరుణించి వారికే మళ్లీ అవకాశం ఇస్తారా అంటే తాజా ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల ఫలితాలు కాదనే సమాధానం ఇస్తున్నాయి. తెలంగాణాలో కేసీఆర్ ఫ్లాగ్ షిప్ పథకంగా దళిత బంధు ను తీసుకుని వచ్చారు. ఒక్కో పేద దళిత కుటుంబానికి ప్రభుత్వం ఏక మొత్తంగా పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయం. ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు పలు పథకాలు అమలు చేశారు. కాని తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ ఎస్ బాగా దెబ్బతిన్నది గ్రామీణ ప్రాంతాల్లోనే. హైదరాబాద్, రంగారెడ్డి వంటి పట్టణ ఓటర్లే బీఆర్ఎస్ ను అంతో ఇంతో ఆదుకున్నారు. ఉచితాలు, సంక్షేమ పథకాలతో అందలం ఎక్కలేరు అనటానికి మరో నిఖార్సైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం. ఐదేళ్ల కాలంలో దాదాపు 3 నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు అందించారు. అయినా ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసే బదులు అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన వంటి వాటిలో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసి ఉంటే ఎన్నికల్లో వైసీపీ ఫలితాలు మరో రకంగా ఉండి ఉండేవి.
ఆర్ధిక నిపుణుల ఆందోళనలు-
ఉచితాలు, అవసరానికి మించి సంక్షేమ పథకాల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందని పలువురు ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎస్బీఐ రెండేళ్ల కిందటే సంక్షేమ పథకాల వ్యయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఏ రకంగా భారం వేస్తుందో అధ్యయనం చేసి మరీ నివేదిక విడుదల చేసింది. అంతెందుకు దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ సైతం పార్టీల ఉచిత వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయపూర్ లో జరిగిన 9వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్- ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తూ ఉచితాలను పెద్ద ఎత్తున రాజకీయ చేయటం ప్రజలను రాజకీయ మత్తులోకి నెట్టేడమే అని నిర్మొహమాటంగా చెప్పారు. సంక్షేమ భారాలతో ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి..?
రాజకీయ పార్టీలు పోటీ పడి ఫ్రీ..ఫ్రీ…అనటం మొదలు పెట్టిన తర్వాత ఓటర్లలో కూడా ఒక నిర్లిప్తత వైఖరి కనిపిస్తోంది. ఈ డబ్బు నాయకులు ఏమైనా వాళ్ల జేబుల్లో నుంచి ఇస్తున్నారా…ప్రజల సొమ్మే కదా ఇస్తున్నది అని తేల్చి పడేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఎన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి పథకాలు రూపంలో అందుకున్నా…ఎన్నికల సమయంలో ఓటుకు నోటు చేతిలో పడకపోతే చాలా మంది పెదవి విరుస్తున్నారు. పచ్చనోటు, బీరు, బిర్యానీ ఇచ్చిన వారికే జై కొట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకే ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రజలను సోమరులను కాకుండా సాధికారులను చేయటానికి ప్రయత్నించాలి. సమాజంలో ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉన్న వర్గాలు, ప్రజలు ఎవరు అన్నది నిజాయితీగా లెక్కలు తీయాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, పని చేసుకునే స్థితిలో లేని ఒంటరి మహిళలు, అనారోగ్య బాధితులు, తీవ్ర పేదరికంలో ఉన్న వారిని గుర్తించాలి. వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. రాజకీయ కారణలతో అర్హత లేని వారికి కూడా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర పథకాలు మంజూరు చేసే విధానానికి స్వస్తి పలకాలి. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన కాకుండా ఉపాధి మార్గాలు చూపించాలి. ఉపాధి కల్పన ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగేటట్లు చూడాలి. షార్ట్ కట్స్ ద్వారా ఎన్నికల్లో గెలవాలి అన్న దృక్పథం మార్చుకోవాలి. విద్య, వైద్యం పై ప్రధానంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. నాణ్యమైన విద్యను ఉచితంగా ప్రభుత్వం అందిస్తే పిల్లలే రేపటి విలువైన మానవ వనరులు అవతారు. సమాజానికి ఉపయోగపడతారు. నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తేస్తే ఆరోగ్యవంతమైన సమాజం తయారు అవుతుంది. ఇటువంటి సమాజం ప్రభుత్వాలు విదిలించే ఉచితాల కోసం చేయి చాచదు. అప్పుడే దేశం అసలైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ప్రపంచం ముందు సగర్వంగా నిలబడుతుంది.