దొమ్మరాజు గుకేష్.. ఇప్పుడీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ పేరు ఇండియన్‌ది కావడం.. అందులోనా తెలుగు మూలాలు కూడా ఉండటం ఇప్పుడు మనందరికి గర్వకారణమని చెప్పాలి. అతి చిన్న వయసులోనే వరల్డ్ చాంపియన్‌గా నిలవడం.. ఆ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్‌గా నిలవడం.. ఇలా ప్రతి ఒక్క విషయం విశేషమనే చెప్పాలి. ఇంతటి చరిత్రను తిరగరాసిన గుకేష్ వయసు.. 18 ఏళ్లు మాత్రమే.
5 గంటల పాటు సస్పెన్స్
ఫైనల్స్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో తలపడ్డాడు గుకేష్. ఈ మ్యాచ్ అటు ఇటుగా 5 గంటలపాటు సాగింది. నిజానికి 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. విజయం గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినా.. ప్రశాంతంగా ఆడిన 32 ఏళ్ల లిరెన్ ఏ చాన్స్ ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. ఈ నిర్ణయంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్ డ్రా అయ్యింది. 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్ సాధించిన గుకేశ్ 7.5 పాయింట్లు సాధించాడు. దీంతో వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు.
ప్రశంసల వెల్లువ
ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ గుకేష్‌ను అభినందించారు. అతడిని ప్రశంసిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గుకేష్ విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమన్నారు మోడీ. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గుకేశ్‌కు ప్రశంశలు అందుతున్నాయి. సీఎంలతో సహా అనేక మంది కీలక నేతలు గుకేష్‌కు అభినందించారు.
చిన్నప్పటి నుంచే..
చెస్ విషయంలో గుకేష్ చిన్నప్పటి నుంచి రాటుదేలాడని చెప్పాలి. 2015 నాటికి అతడికి ఆసియా స్కూల్ ఆఫ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో అండర్-9 విభాగంలో గెలుపొందాడు. దీంతో చెస్‌పై తనదైన ముద్ర వేసుకున్నాడు. 2018లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించాడు. ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఐదు గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2017లో అంతర్జాతీయ మాస్టర్‌గా, రెండు సంవత్సరాల తర్వాత, చెస్ చరిత్రలో మూడవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా మారిన గుకేష్ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండే గుకేష్ చదరంగంపై ఉన్న ఆసక్తితో 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం చదరంగంపై గుకేష్ కున్న ఆసక్తి ప్రపంచ చెస్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీసేందుకు కారణమైంది. అత్యంత పిన్న వయసు చెస్ ఛాంపియన్‌గా గారీ కాన్స్ రోవ్ రికార్డును బద్దలు కొట్టిన ఆటగాడిగా దొమ్మరాజు గుకేష్ నిలవడంతో చెస్ వరల్డ్‌లో ఇండియాది అప్పర్ హ్యాండ్ అయ్యింది.
ఇంతకీ లోకేష్ తెలుగువాడా? తమిళుడా?
గుకేష్ గెలిచిన తర్వాత అతడిని అంతా అభినందిస్తుంటే ఓ వివాదం మాత్రం తెలుగు, తమిళుల మధ్య మొదలైంది. లోకేష్ తెలుగు వాడంటూ ఏపీ వాళ్లు.. కాదంటూ తమిళ తంబీలు సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం ప్రకటించారు. నిజానికి గుకేష్ పుట్టింది.. పెరిగింది.. మొత్తం చెన్నైలోనే అని చెప్పాలి. కానీ అతని పూర్వికులు మాత్రం ఏపీకి చెందినవారు. గుకేష్ తాతా ముత్తాతల సొంతూరు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ. కండ్రిగకు చెందిన ENT సర్జన్ డాక్టర్ రజినీకాంత్, మైక్రో బయాలజిస్ట్ పద్మా దంపతులు చెన్నైలో స్థిరపడ్డారు. వీరికే 2006 మే 29న గుకేష్ జన్మించాడు. సో టెక్నికల్‌గా చూస్తే గుకేష్ చెన్నైకి చెందినవాడు.. కానీ అతని మూలాలు మాత్రం ఏపీతో ముడిపడి ఉన్నాయి.