సింగరాజు పాలెం సిద్దాంతిగా, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత జ్యోతీష్కుడిగా ఫేమస్ అయిన కొఠారు సత్యనారాయణ చౌదరి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. కొన్ని రోజులుగా హైదారాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ చౌదరి బుధవారం రాత్రి మృతి చెందారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో పాటు బీపీ కంట్రోల్లో లేకపోవడంతో ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. సత్యనారాయన చౌదరి స్వగ్రామమైన సింగరాజు పాలెంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యనారాయణ చౌదరి సినీ నటుడు బాలకృష్ణ వద్ద చాలా కాలం వ్యక్తిగత జ్యోతిష్కులుగా పనిచేశారు. అయితే 2004 జూన్ 3వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని బాలకృష్ణ నివాసంలో జరిగిన కాల్పులు సంఘటనతో సత్యనారాయణ చౌదరి రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ రోజు జరిగిన కాల్పుల ఘటనలో నిర్మాత బెల్లంకొండ సురేష్ తో పాటు సత్యనారాయణ చౌదరి కూడా గాయపడ్డారు. ఆ ఘటనలో సత్యనారాయణ చౌదరి శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకు పోగా వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి రెండు బెల్లెట్లను తొలగించారు. మరో బుల్లెట్ ఇప్పటికీ సత్యనారాయణ చౌదరి శరీరంలోనినే ఉంది. సత్యనారాయణ చౌదరకి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
- Advertisement with us -