25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

ఖాకీలకూ కౌన్సిలింగ్‌ అవసరమా? వాళ్లకేమైనా అర్థమవుతోందా?

సాధారణంగా ఏదైనా సమస్య వస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాం. తమకేదైనా కష్టం ఎదురైతే ఖాకీలే కాపాడాలని కాంప్లెయింట్ ఇస్తాం. మనల్ని ఎవరైనా బెదిరించినా, వేధించినా, నష్టం చేసినా వాళ్ల బెండు తీయాలంటూ ఫిర్యాదు చేస్తాం. కానీ, కొద్దిరోజులుగా తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఏకంగా పోలీసులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కిందిస్థాయి పోలీసులే కాదు.. ఆఫీసర్‌ స్థాయి పోలీసులూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది.

తెలంగాణలో పోలీసుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలి కాలంలోనే ఆరుగురు పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్రంగా కలత చెందేలా చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే చూస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు ఎస్‌ఐలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.ఇప్పుడు మరో కానిస్టేబుల్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త సంవత్సరం నాడు.. బుధవారం కిరణ్‌ అనే కానిస్టేబుల్‌ తమ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు.

హైదరాబాద్‌ మలక్‌పేటలోని గాంధీనగర్‌ ఆస్మాన్‌ఘడ్‌ బస్తీలో నివసించే జటావత్‌ కిరణ్‌.. ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కిరణ్‌ 2014 బ్యాచ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. సమాచారం అందుకున్న మలక్‌పేట్‌ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, మద్యానికి బానిసైన కిరణ్‌.. కుటుంబ కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. కిరణ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పై పోర్షన్‌లో అతడి సోదరుడు నివాసముంటుండగా, కింది పోర్షన్‌లో కిరణ్‌ కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసైన కిరణ్‌, భార్య పిల్లలను వేధిస్తుండేవాడని చెబుతున్నారు.
భార్య పిల్లలను ఇంట్లో నుంచి బయటికి పంపించి తలుపులు వేసుకొని తాగుతుండేవాడు. అయితే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నాలుగురోజుల ముందుగానే లీవ్‌ పెట్టి ఇంటి వద్దనే ఉంటున్న కిరణ్‌ నిత్యం తాగి భార్య పిల్లలతో గొడవ పడుతున్నాడు. బుధవారం ఉదయం తాగివచ్చి భార్య పిల్లలతో గొడవపడి వారిని బయటికి పంపించి తలుపులు వేసుకున్నాడు. దాంతో వారు ఇరుగు, పొరుగు ఇళ్లల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండి భోజనం చేసేందుకని ఇంటికి వచ్చారు. తలుపులను బాధినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికిలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దాంతో బోరుమన్న అతడి భార్య, సోదరుడికి ఫోన్‌చేసి వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, సమాజంలోని సమస్యలు పరిష్కరించాల్సిన వృత్తిలో ఉన్న పోలీసులు.. ఇలా వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. జరిగిన సంఘటనలను బట్టి చూస్తే వాళ్లే సమస్యలు కొని తెచ్చుకుంటున్నారా, లేదంటే ఇతర సమస్యలతో మానసికంగా కుంగిపోయి చనిపోతున్నారా? అనేది చర్చను లేవనెత్తుతోంది. ఉన్నతాధికారులు ఈ పరిస్థితులను సమీక్షించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసు సిబ్బంది మానసిక పరిస్థితులను అంచనా వేస్తూ.. అవసరమైనవాళ్లకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని కిందిస్థాయి సిబ్బంది కోరుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com