29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

రంగంలోకి దిగిన ఈడీ – కేటీఆర్‌ అరెస్ట్‌ తప్పదా?

– ఫార్ములా -ఈ రేస్‌ కేసులో నేటినుంచి ఈడీ విచారణ
– నేడు ఈడీ ముందుకు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌
– రేపు విచారణకు హాజరు కానున్న అరవింద్‌కుమార్
– ఈనెల 7వ తేదీన ఈడీ ముందుకు కేటీఆర్‌

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫార్ములా – ఈరేస్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ వేగవంతం చేసింది. ఇవాల్టి నుంచి వ్యక్తిగత విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా విచారణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఈడీ ముందుకు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి హాజరవుతున్నారు. రేపు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ విచారణకు ఈడీ ముందు హాజరవుతున్నారు. అలాగే, ఈనెల 7వ తేదీన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. దీనికోసం ఇప్పటికే ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఇప్పుడు 7వ తేదీ టెన్షన్‌ మొదలయ్యింది. ఇక్కడ తెలంగాణలో ఈ కేసును విచారిస్తున్న ఏసీబీకి కేసు తుది విచారణ పూర్తయ్యే దాకా కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో కేటీఆర్‌, ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నేతలు జోష్‌లో మునిగిపోయారు. అయితే, ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో మళ్లీ వణుకు మొదలయ్యింది.

హెచ్‌ఎండీఏ నిధులను ఫార్ములా ఈ- కారు రేస్‌ పేరుతో విదేశీ కంపెనీకి బదిలీ చేసిన కేసులో ఈ విచారణ చేపడుతోంది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆధారాలు సేకరించిన ఈడీ ఇవాల్టి నుంచి విచారణను వేగవంతం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. వీటికి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంంభించిన తెలంగాణ ఏసీబీ అధికారులు ఈ ఆధారాలకు సంబంధించిన కీలక పత్రాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండానే రూ.55 కోట్లు కేటాయించడం, విదేశీ కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ చేయడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏసీబీ విచారణకు అనుమతించింది. అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌‌‌ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్(ఎమ్‌‌‌‌ఏయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ సమక్షంలోనే ఈ నిధులు దారిమళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫార్ములా ఈ-రేస్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నుంచి నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. అయితే, ఇంతకుముందే ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ను విచారించిన సమయంలో కేటీఆర్‌ మౌఖిక ఆదేశాలతోనే తాను విదేశీకంపెనీకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు ఏసీబీ అధికారులకు క్లియర్‌గా సమాధానం ఇచ్చారు. దీంతో, అప్పటి మంత్రి కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించారని కేటీఆర్‎పై అభియోగాలు మోపింది. ఈ కేసులో ఈడీ జనవరి 2వ తేదీ నుంచి విచారణ వేగవంతం చేసింది. వరుసగా అధికారులను విచారించనుంది.

అయితే ఈనెల 7వ తేదీన కేటీఆర్‌ను విచారణకు పిలిచిన ఈడీ అధికారులు అయనను అరెస్ట్‌ చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో తనను అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కేటీఆర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈకేసు విచారణ పూర్తయి తుదితీర్పు వచ్చేదాకా కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, ఈడీకి ఆ మార్గదర్శకాలు వర్తించవంటున్నారు. ఏసీబీకి అరెస్ట్‌ చేసే అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో ఈడీ అధికారులు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేస్తారన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com