- ఏపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం
- దేవాదాయ భూములు వేలం వేయకుండా లీజుల పొడిగింపు
- అస్మదీయులకు కట్టబెట్టేందుకే నిబంధనల మార్పు
- దేవాదాయ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేని లోటు
- ఇంచార్జ్ కమిషనర్ తో వ్యవహారం చక్క బెడుతున్న ప్రభుత్వం
- దేవుళ్ల ఆస్తులను గుట్టు చప్పుడు కాకుండా కరిగించేస్తున్నారా?
- పాత లైసెన్సులను మళ్లీ అంతే కాలానికి పొడిగింపా?
- దుర్గ గుడి భూములను ఓ విద్యాసంస్థకు లీజుకిచ్చిన ప్రభుత్వం
- ఇప్పుడా లీజును 50 ఏళ్ల పాటు పొడిగించే కుట్ర
- లీగల్ అడ్డంకులను సైతం దాటేసేలా నిబంధనల మార్పు
- ప్రభుత్వ పెద్దల నిర్ణయం ఎవరికోసం?
- ప్రభుత్వంలో ఉంటూ నోరు మెదపని జనసేనాని, బీజేపి
- స్వామీజీలు, హిందూ సంఘాల మౌనం దేనికి సంకేతం?
- ఈ అంశం చర్చిస్తుంటే విమర్శలేంటి?
ఏపీలో దేవాదాయ భూముల్ని 33 ఏళ్ల పాటు లీజుకివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 139 జీవో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో అదీ హిందూ మత పరిరక్ణణకు కట్టుబడి ఉన్నామన్న సనాతని నేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటా అని అందరూ నోళ్లు నొక్కుకుంటున్నారు.
దేవాదాయ శాఖ భూముల్ని పరిరక్షించేందుకు ఉన్నతాధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు చక్రం తిప్పి తాము అనుకున్న వారికే ఆ భూముల లీజు దక్కేలా నిబంధనలు రూపొందించారన్న విమర్శలు రేగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు పెద్ద ఎత్తున భూముల రూపంలో స్థిరాస్థులున్నాయి. అయితే వాటిని ప్రభుత్వం లీజుకిస్తూ దానిపై ఆదాయం పొందుతోంది. అయితే దేవుడి మాన్యాలు దేవుడికే దక్కకుండా చేస్తున్న ఈ లీజుల పాలసీ వల్ల ఆలయాలు బాగుపడకపోగా, లీజుతో ప్రభుత్వానికి ఆదాయమూ పెద్దగా రావడం లేదు. ఇక లీజులు పొందిన వారు ఆ భూములపై వ్యాపారం చేసుకుంటున్నారు. వాటిని తనఖా పెట్టి లోన్లు తీసుకుని వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. దేవుడికి తరగని ఆస్తులున్నా.. ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు జీర్ణోద్ధరణకు నోచుకోవడం లేదు. ఇప్పటికీ ధూప, దీప నైవేద్యాలు లేని పురాతన ఆలయాలు ఎన్నో..ఎన్నెన్నో. అసలు ఈ భూముల లీజుల వ్యవహారం ప్రభుత్వం అయినవారికి అప్పగించడానికే ఇంత కథ నడిపిందని సీనియర్ అధికారులు కూడా అంటున్నారు. విజయవాడలో దేవుడి భూమిని ఓ విద్యాసంస్థకు లీజుకివ్వాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అత్యంత తక్కువ ధరకు దుర్గ గుడి భూముల్ని 50 ఏళ్ల లీజుతో ఆ సంస్థకు కట్టబెట్టాలని ప్రయత్నించగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. ఈ లీజులు కట్టబెట్టేందుకు నిబంధనలను సైతం సవరించిన ఘనులు ఉన్నారు. దీనికి న్యాయపరంగా అడ్డంకులు ఉన్నా139 జీవోను తేవడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ శాఖలో ప్రస్తుతం పూర్తి స్థాయి అధికారి లేకపోవడం, దుర్గగుడి ఈవోకే అదనంగా ఈ బాధ్యతలు అప్పగించడంతో ఈ తరహా నిర్ణయాలకు ఆస్కారం ఏర్పడింది.
అసలేం జరిగింది?
గతనెల 17న దేవాదాయశాఖ ఇంచార్జి కమిషనర్ దేవాదాయ సంస్థల స్థిరాస్థుల లైసెన్సుల నిబంధనలను మార్చాల్సి ఉందని సూచించారు. ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించే ప్రముఖ సంస్థలకు భూముల కేటాయింపులో నిబంధనలు సడలించాలన్నది ప్రతిపాదన. ఆ వెంటనే ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి నిబంధనల్లో వారికి కావల్సిన మార్పులు చేర్పులు చేసేసింది. దేవాదాయశాఖ పరిధిలోని వ్యవసాయేతర భూముల నిబంధనల సడలింపు, ఆపై దేవాదాయ భూముల లీజుల్లో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసుకునేలా సబ్ క్లాజులను చేర్చడం చెక చెకగా జరిగిపోయింది.
ఏపీ చారిటబుల్ అండ్ హిందూ మత సంస్థల చట్టం 1987 సెక్షన్ 2(5) ప్రకారం 20 ఏళ్లకు పైబడి ధార్మిక కార్యక్రమాలు చేసే సంస్థల లీజులు పొడిగించడం, బహిరంగ వేలం వేయకుండానే వాటిని వారికి కేటాయించడం, అలాగే అతి తక్కువ ధరలకు ఆ భూములను వారికి కట్టపెట్టడం అనే క్లాజులు చేరిపోయాయి. ఇప్పటికే సుదీర్ఘకాలంగా లీజుకి ఉన్న భూములను మళ్లీ అవే సంస్థలకు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడం అంటే దేవుడి ఆస్తులను అన్యాయంగా వారికి ధారాదత్తం చేయడమే. పైగా అన్నేళ్ల పాటు భూమి వేరొకరి అధీనంలో ఉంటే చివరకు అది వారికే చెందే ప్రమాదం కూడా ఉంది. వివాదాస్పద 139 జీవో కేవలం ఏలిన వారు వారికి కావల్సిన వారికి భూములు కట్టబెట్టడానికే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. దుర్గ గుడి భూములు ఇప్పటికే ఒక విద్యాసంస్థ లీజులో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మరో 50 ఏళ్లకు పొడిగించాలన్న ప్రతిపాదన రాగా దేవదాయశాఖ లీగల్ విభాగం దీనికి అడ్డుపడింది. ఇప్పటికే 50 ఏళ్లు లీజుకి ఉన్న ఆ భూములను మరో 50 ఏళ్ల పాటు పొడిగించడం అంటే ఇక ఆభూములపై శాశ్వతంగా హక్కులను వదులుకోవడమేనన్న అనుమానాలు అధికార్లు వ్యక్తం చేశారు.
ఉన్న లీజులను ఉన్నవి ఉన్నట్లు మళ్లీ పొడిగించడం అంటే ఇక ఆ భూములను ఆ సంస్థలకు కట్టబెట్టేందుకు వేసిన ఎత్తుగడగా అర్ధం చేసుకోవాల్సి ఉంటుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పైగా దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలంటూ మొక్కుబడిగా ఓ నోటీస్ కూడా విడుదల చేశారు. ఆపై గుట్టు చప్పుడు కాకుండా వారి ప్లాన్ అమలు జరిపేందుకే ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళుతున్నారని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
దేవాదాయ శాఖ భూములతో ప్రభుత్వం ఇంత రాజకీయం చేస్తున్నా ప్రతిపక్షాలు కానీ, హిందూ సనాతని వాదులు కానీ నోరు మెదపక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హిందూ మత ఉద్ధారకులమని చెప్పుకునే బీజేపి కానీ, జనసేన కానీ దీనిపై నోరెందుకు మెదపడం లేదో అర్ధం కావడం లేదు. అసలు ఏపీ బీజేపి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇది దేవాదాయ భూములను అయిన వారికి కట్టబెట్టుకునే ఎత్తుగడగా కూటమి భాగస్వాములకు అర్ధం కావడం లేదా? లేక దేవుడి పేరు చెప్పి ఊరికే రాజకీయం చేయడమే వారి ఉద్దేశమా? హిందూమత ఔన్నత్యం పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పే స్వామీజీలు కూడా దీనిపై నోరు మెదపడం లేదు. ఐవైఆర్, ఎల్ వి సుబ్రహ్మణ్యంలాంటి సనాతన వాదులు దీనిపై మాట్లాడుతుంటే… అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రభుత్వ అనుకూల మీడియా వారిపై నోరు పారేసుకుంటోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం దేవాలయాల భూముల లీజులు ఆపాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు