28.7 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ మాటల దుమారం

  • ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల ముప్పేట దాడి

  • స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అటు.. ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఇటు విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని వెల్లడించే క్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఎమోషనల్‌గా ఫీలయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడీ అంశం భావోద్వేగ సమస్యగా మారింది. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు, మరోవైపు.. రాజకీయ పార్టీలు కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో, పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. అసలు రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఉద్యోగ సంఘాల రియాక్షన్స్‌, ఈ పరిస్థితులను విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్న వ్యవహారం గురించి వివరంగా చూద్దాం…

రేవంత్‌ వ్యాఖ్యలు :

తెలంగాణలో ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. జీతాలు ఆలస్యం అవుతుండటం, డీఏ పెంపు ఆలస్యం, పెన్షన్‌ బకాయిలు క్లియర్‌ చేయడం కోసం పోరాట బాటను ఎంచుకున్నాయి. ఇక సమరమే.. అని ప్రకటనలు చేశాయి. దీంతో, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఉద్యోగుల విధేయతను ప్రస్తావిస్తూ.. ఈ సమరం ప్రభుత్వంపై కాదని, ప్రజలపై చేస్తున్నదిగా భావించాల్సి వస్తుందన్నారు. “నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు చెప్పండి… ఏ పథకం ఆపాలి? బోనస్ తీసుకుందామా? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా? ఏం చేద్దాం చెప్పండి…” అంటూ సీఎం ఆవేశంగా స్పందించారు. “ఈ స్థితిలో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆర్థికంగా దివాలా రాష్ట్రంగా మారిపోతాం. అప్పు కూడా పుట్టట్లేదు. ఢిల్లీలో అపాయింట్‌మెంట్ కోరితే కూడా ఇవ్వట్లేదు. చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అనిపిస్తోంది. దేశం ముందు తెలంగాణ పరిస్థితి హీనంగా తయారైంది.” అని రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం మాటల ప్రకంపనలు :

ఈ స్థాయిలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గడచిన పదేళ్ల పాలనను విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే గతి తమ పాలనకు వస్తే, ఉద్యోగులను, ప్రజలను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు జీతాలు ఆలస్యం అవుతున్నాయని, పెన్షన్ బకాయిలు క్లియర్ చేయాలంటూ చేసే పోరాటాన్ని ‘ప్రజలపై యుద్ధం’గా చిత్రించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం దివాళా తీసిందని చెబుతున్న వ్యాఖ్యలతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులకు తోడు.. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా రెస్పాండ్‌ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్‌ వార్‌ మొదలయ్యింది. రేవంత్‌ రెడ్డికి పాలన చేత కాదన్న నినాదం అందరూ ఎత్తుకున్నారు. చేతగాకపోతే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేయాలని మూకుమ్మడిగా డిమాండ్లు చేశారు.

కేటీఆర్‌ వ్యక్తిగత విమర్శలు :

ఈ పరిస్థితులను ప్రధానంగా బీఆర్‌ఎస్‌ తనకు అనుకూలంగా మలచుకోవడానికి రెడీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ఇస్తామని చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని కేటీఆర్‌ అన్నారు. ఉద్యోగుల త్యాగాల గురించి రేవంత్‌ రెడ్డికి తెలియదని, ఎన్జీఓల త్యాగాలతో తెలంగాణ వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ఉద్యోగులకు 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నాయకత్వ లోపం తెలంగాణకు శాపమని అన్నారు. తండ్రిలాంటి ముఖ్యమంత్రే సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను అవమానించే విధంగా రేవంత్‌ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చేతకాదని.. రేవంత్ రెడ్డి కాడి పడేశాడని కేటీఆర్‌ విమర్శించారు. ఓ స్టెప్‌ ముందుకేసి రేవంత్‌ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. ఎక్కడైనా దొంగను దొంగే అంటారని, దొంగ అని తెలిసినా కూడా పార్టీలోకి తీసుకొని ఓ దొంగను సీఎం చేసిన దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు.

పాలన చేత కావట్లేదన్న జగదీష్‌ రెడ్డి :

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. రేవంత్‌కు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. రేవంత్‌ రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివనట్లుందని, తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఢోకా లేదని,రేవంత్‌కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయని విమర్శలు చేశారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు.

రాష్ట్రం పరువు తీశారన్న బండి సంజయ్‌ :

ఇక, ఇదే పరిస్థితిపై బీజేపీ నాయకులు కూడా తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి అధైర్యం నింపుతారా? అని నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసు కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని, రేవంత్‌ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని బండి సంజయ్‌ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ దివాళా తీసిందన్న ఈటల :

మరోవైపు.. ఎంపీ ఈటల రాజేందర్‌ కూడా రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దివాళా తీసింది తెలంగాణ కాదని, కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తాను సిఎం అని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. నెలకు దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుంటే.. దివాళా తీసిందని ఎలా అంటారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని.. ఇప్పటికీ దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆయన అన్నారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెల్వదా? అంటూ ప్రశ్నించారు.

బాధ్యతా రాహిత్యమన్న లక్ష్మణ్‌ :

బీజేపీ మరో ఎంపీ లక్ష్మణ్‌ కూడా సీఎం రేవంత్‌పై నిప్పులు కురిపించారు. గద్దెనెక్కిన తర్వాత సమ్మెలు వద్దు, ఆందోళనలు చేయొద్దు అనడం ఎలా? అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. హామీలు ప్రకటించేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? సాధ్యంకాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆర్ధిక పరిస్థితిని దాపురంగా చూపుతున్నారు. ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనమంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.

స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన పొంగులేటి :

అటు.. విపక్షాల విమర్శలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని పొంగులేటి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాక ముందు రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు ఉందని అనుకున్నామని.. తీరా చూస్తే రూ.8 లక్షల కోట్లు ఉందన్నారు. అంత అప్పు ఉన్నా.. 15 నెలల పాలనలో సంక్షేమ పథకాలను ఆపలేదని అన్నారు. ప్రతి నెలా అప్పులకే దాదాపు రూ.6,500 కోట్లు మేర చెల్లిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. షో పాలిటిక్స్ చేయడం ఇందిరమ్మ ప్రభుత్వానికి తెలియదని.. అప్పుల విషయంలో నిజాలను ప్రజలకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలని పేర్కొన్నారు. అప్పులపై వాస్తవాలను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క లెక్కలతో సహా చెబితే.. గుండాగిరీ చేస్తూ తప్పును ఒప్పు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది వాస్తవం కాదా? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com