తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వాయిదా వేసుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మంగళవారం ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. మంత్రితో జరిగిన చర్చలు సఫలం కావడంతో.. ముందుగా ప్రకటించిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు.
ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణ భాస్కర్‌లను నియమించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారం సూచించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించి.. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది.
మరోవైపు.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చల అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రైవేటు విద్యుత్ బస్సుల గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. ప్రభుత్వమే విద్యుత్ బస్సులు కొని ఆర్టీసీకి ఇచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు.
అదేవిధంగా సింగరేణి సంస్థలో ప్రస్తుతం అమలు చేస్తున్న మాదిరిగా రెగ్యులర్ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరామని నాయకులు చెప్పారు. కారుణ్య నియామకాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెండింగ్ బకాయిలపై కూడా మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారని.. వేతన సవరణ గురించి కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కూడా సుదీర్ఘంగా చర్చించామని జేఏసీ నేతలు తెలిపారు. అందుకే ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేసుకున్నామని వివరించారు.