రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్, బీజెపిలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉమ్మడి మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అదే స్థానంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది.
మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఇప్పటివరకు జీవన్ రెడ్డి(కాంగ్రెస్) కొనసాగుతున్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తం రెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సి రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.
కాంగ్రెస్ నుంచి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డి తలపడుతున్నారు. బీజెపి నుంచి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి పోటీచేస్తున్నారు. అంజిరెడ్డి భార్య గోదావరి సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలిగా ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే ఆర్థిక,సామాజిక బలం కలిగిన నేతగా నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. నరేందర్ రెడ్డి విద్యా సంస్థల అధినేతగా సుపరిచితులే అయినా విద్యార్థుల ఫీజు విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తారని సమాచారం. పార్టీ నేత కాకపోవటం, ఆర్థిక బలం ఉన్న వ్యక్తిని పార్టీగా ప్రకటించటం కొంత ప్రతికూల ఆంశం కాగా షరామామూలుగానే కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి పార్టీలో ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో కొంత నైరాశ్యంలో ఉన్నారు. తాజా రాజకీయాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా మళ్లీ పోటీ చేయనని ముందే ప్రకటించారు. సీనియర్ నేత కావడంతో తప్పదన్నట్టుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. జగిత్యాల జిల్లా దాటి ఎక్కడికీ వెళ్లడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు పార్టీ నేతలను సమన్వయం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నా మంత్రి పదవి రాకపోవడంతో కొంత నిరాశలో ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేత, బోధన్ ఎమ్మల్యే సుదర్శన్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నా ఆయన తీరే వేరని పార్టీ నేతలే గుసగుసలు పెడుతున్నారు. జగ్గారెడ్డి తనకు మంత్రి పదవి రాలేదని… అయినా పార్టీ కోసం పనిచేస్తానని తరచుగా చెపుతున్నా జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్టు ఉండగా ఈ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది.
బిజెపి నుంచి గట్టి పోటీ ఉండడంతో అన్ని పరిస్థితులు అంచనా వేసిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేరోజు అదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఏకంగా మూడు బహిరంగ సభలు నిర్వహించారు. ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం అకస్మాత్తుగా సీఎం స్థాయిలో ఇంత హడావిడి చేయటం అందరినీ విస్మయ పరుస్తోంది.
ఎట్టి పరిస్థితిలో ఈ సిట్టింగ్ సీటు పోవద్దని… అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రులు ఎవరు ప్రాతినిధ్యం వహించడం లేదు.. దీంతో బాధ్యత అంతా పిసిసి అధ్యక్షుడు, సీఎం దేనిని అధిష్టానం ఖరాఖండిగా చెప్పినట్టుగా తెలిసింది..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిందని ఎక్కడా నిర్లక్ష్యంగా లేదనే విషయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ వేయొచ్చని పార్టీ భావిస్తోంది.
అయితే బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ సానుభూతిపరులు కాంగ్రెస్, బీజెపీల్లో ఎటువైపు మొగ్గు చూపుతారనేది గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందనటంలో సందేహం లేదు. లోపాయికారిగా కమలం వైపే కారు నేతలు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పట్టభద్రుల స్థానం అధికార పార్టీకి సవాల్ గా మారింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు జీవన్ రెడ్డి గెలిచిన స్థానం…ప్రభుత్వ పాలనకు ఫలితాలే నిదర్శనమని ఆ రోజు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ కు ఎదురవుతోంది. ఈ సీటు ఫలితాల్లో తేడా వస్తే కొందరు పెద్దల పునాదులు కదులుతాయని చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల విషయంలో హై కమాండ్ నుంచి సీరియస్ గా ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రావటం రాష్ట్రంలోని కొందరు అగ్రనేతలకు సంకటంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వారికి పరీక్షగా మారాయి. పార్టీ వ్యవహారాల్లో నిక్కచ్చిగా నడుచుకుంటారని మీనాక్షి నటరాజన్ కు పేరుంది. రాష్ట్రంలో పార్టీ గాడితప్పుతోందనే రాహూల్‌గాంధీ ప్రత్యేకంగా మీనాక్షికి బాధ్యతలు అప్పగించారని విశ్వసనీయ సమాచారం.
ఓ ఎమ్మెల్సీ స్థానం కోసం ముఖ్యమంత్రి ఇంత హడావిడిగా సుడిగాలి పర్యటన చేయటం.. మరో రెండు రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు పరీక్షేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.