-
అసెంబ్లీలో విపక్ష హోదా లేదని తేల్చిన స్పీకర్
-
నిబంధనలు అంగీకరించవని స్పష్టం
-
మొత్తం సీట్లలో కనీసం పదోవంతు సీట్లు గెలిస్తేనే హోదా
-
వైసీపీని అసెంబ్లీలో ఆడుకోవాలన్న ప్లాన్‌కి కౌంటర్
-
ప్రభుత్వ డైవర్షన్ గేమ్‌కు ప్రజాక్షేత్ర పోరాటాలతో చెక్
-
వాళ్ల నోటితో చెప్పించడం కూడా వ్యూహమే
ఏపీ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎప్పటినుంచో పట్టుబడుతోంది వైసీపీ. తొలిరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆతర్వాత ఆయన అసెంబ్లీ ముఖమే చూడలేదు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలను బహిష్కరిస్తూనే వస్తున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేకుంటే అధికార పక్షం తమ వాక్ స్వాతంత్రాన్ని హరించేస్తుందని వైసీపీ నేతలు ఎప్పటినుంచో అంటున్నారు. జగన్ అసలు అసెంబ్లీకే రాకపోవడంతో అధికార పక్షం మాటల దాడిని ముమ్మరం చేసింది.మరో వైపు 60రోజులకు మించి ఏ ఎమ్మెల్యే అయినా సభకు హాజరు కాకపోతే ఆటోమేటిగ్గా సభ్యత్వం రద్దవుతుందని స్పీకర్ సూచన చేశారు.ఇవాళ అసెంబ్లీకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు విపక్ష హోదా కోసం డిమాండ్ తో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆపై వాకౌట్ చేశారు..
ప్రతిపక్ష హోదాకు అర్హతేంటి?
ఏ పార్టీ అయినా ఉభయ సభల్లో ప్రతిపక్ష హోదా సాధించాలనుకుంటే అసెంబ్లీ మొత్తం బలంలో పదోవంతు సీట్లు సాధించి ఉండాలి.కానీ వైసీపీ సాధించినది 11 సీట్లే. 42 శాతం ఓటు బ్యాంకును పక్కా చేసుకున్నప్పటికీ సీట్లు సాధించడంలో వైసీపి విఫలమైంది . దాంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షమన్నది లేకుండా పోయింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
పార్లమెంటరీ నిబంధనల అధికారిక పబ్లికేషన్ కౌల్ అండ్ షక్దర్ లో ప్రతిపక్ష హోదా అర్హత గురించి స్పష్టమైన నిబంధనలున్నాయి.మొత్తం సీట్లలో కనీసం పదో వంతు సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష హోదాకు అర్హత ఉంటుంది.ఆ ప్రకారం చూస్తే ప్రతిపక్ష హోదా రాదు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటి వరకూ ఏరాష్ట్రంలోనూ, ఏ పార్టీకి ఇలా అర్హత కట్టబెట్టిన దాఖలాలు లేవు.
వైసీపీ వాదన ఏంటి?
ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో 175 మంది సభ్యులున్నారు.టీడీపీ, బీజేపి, జనసేన కూటమిగా పోటీ చేసి 135 సీట్లు సాధించాయి. జనసేన తొలిసారి 21 సీట్లతో అసెంబ్లీ లోకి అడుగు పెట్టింది. వైసీపికి కేవలం 11 సీట్లే దక్కాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం అవసరం.ప్రతిపక్షమన్నది లేనప్పుడు ఉన్న విపక్షానికే ఆ హోదా కట్టబెట్టడం న్యాయమని వైసీపీ అంటోంది.
వైసీపీ వ్యూహమిదేనా?
అసెంబ్లీలో అధికార పక్షం ఎలాగూ తమకు సమయం ఇవ్వకుండా మైకు కట్ చేస్తూ ఏకపక్ష ధోరణులు అవలంబించడం ఖాయం.. సభలో ఈ మాటల దాడి ఇంకా ముమ్మరం చేయవచ్చు. అసెంబ్లీలో సీట్ల కేటాయంపు లో కూడా ప్రాధాన్యత ఉండదు. విపక్ష హోదా అర్హత ఉంటేనే జగన్ కి మొదటి వరుసలో సీట్లు కేటాయిస్తారు. ఆ అర్హత లేనందున జగన్ కూడా సాధారణ ఎమ్మెల్యేగా తనకు కేటాయించిన స్థానంలో కూర్చోవాల్సివస్తుంది. 11 మంది సభ్యులే కాబట్టి మాట్లాడేందుకు ఇచ్చే సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది.
హామీల అమలు వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి కూటమి మాటల తూటాలతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుంది. రివెంజ్ పాలిటిక్స్ ఓ రేంజ్ లో మొదలవుతాయి.. సూపర్ సిక్స్ హామీలు, పథకాలు, పెన్షన్ల అమలు వైఫల్యాన్ని గానీ ప్రశ్నించే అవకాశం ఉండదు సరికదా. ప్రభుత్వం ఏం చేసినా చూస్తూ కూర్చోవాల్సిందే.దీనికన్నా ప్రజాసమస్యలపై పోరాటం చేయడానికి ప్రజాక్షేత్రం కన్నా అనువైన ప్రదేశం మరోటి ఉండదు. పైగా ప్రజా క్షేత్రంలో వైసీపీ పట్టు పెరుగుతుంది. కార్యకర్తలు, లీడర్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిని క్యాచ్ చేస్తే పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం, పట్టు పెరిగి రానున్న ఎన్నికల్లో గెలుపు సులభమవుతుంది.తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో జరిపిన భేటీలో కూడా జగన్ ఇదే అభిప్రాయం చెప్పారు. సో..అవకాశం లేకపోయినా అడిగి, డిమాండ్‌చేసి ఆ వంకతో అసెంబ్లీని బహిష్కరించాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.. పోరాటమే శరణ్యంగా ఇక ప్రజాక్షేత్రంలోకి దూకడం ఖాయంగా కనిపిస్తోంది.