గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం .. ఈ రెండు వ్యవస్థల మధ్య ఒక్కసారి వివాదం స్టార్టయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనడానికి ప్రత్యేక ఉదాహారణ తమిళనాడు. స్టాలిన్ సర్కార్ ఏం చేసినా.. దాన్ని అడ్డుకోవడమో లేదా పెండింగ్‌లో పెట్టడమో కామన్‌గా మారింది ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి. దీంతో ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా గవర్నర్ గిరికి మొట్టికాయలు వేసినట్టు తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం.
అత్యంత ఉన్నతమైన పదవిలో ఉంటూ గవర్నర్ ఆర్ఎన్ రవి ఇలా ప్రవర్తించడం సరికాదంటూ సూచించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లుల్ని నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం స్టాలిన్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కీలక బిల్లులకు ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్దమని తెలిపింది సుప్రీంకోర్టు.
అసలేం జరిగిందంటే..?
12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023లో అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. తన వద్ద 10 బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్ 2023 నవంబర్ 13న ప్రకటించారు. తర్వాత అసెంబ్లీ నవంబర్ 18న ప్రత్యేకంగా సమావేశమై ఆ 10 బిల్లులను మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. తన వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్ నవంబర్ 28న రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. ఇదే వివాదానికి కారణమైంది.
10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలనడం చట్ట విరుద్దమని తెలిపింది సుప్రీంకోర్టు. అంతేకాదు అసెంబ్లీ రెండోసారి బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి సిఫార్సు చేయడం సరికాదని కూడా తెలిపింది. ఇది చట్ట విరుద్ధమవుతుందని అసెంబ్లీ రెండోసారి బిల్లులు ఆమోదిస్తే గవర్నర్ ఆమోదం పొందినట్టే అని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనుకుంటే 3 నెలల్లోపు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలంది సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుచారిత్రాత్మకం అన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. సుప్రీంకోర్టు తీర్పుపై సంబరాలు జరుపుకోవాలని అధికారపక్ష సభ్యులకు సూచించారు. తమిళనాడు ప్రజలకు, తమ న్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు.