ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది కోల్‌కతా నైట్ రైడర్స్. నిజానికి LSG, KKR మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు రెచ్చిపోయారు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో.. కోల్‌కతా ముందు 239 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. అయితే ఈ స్కోర్ చేసేందుకు బరిలోకి దిగిన KKR.. గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమిని చవిచూసింది. టాపార్డర్ మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ మిడిల్ ఆర్డర్ నుంచి సహకారం లేకపోవడం.. చివర్లో రింకూ సింగ్ ధనాధన్ బ్యాటింగ్ చేసినా నాలుగు పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది.
239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు రహానే, సునీల్ నరైన్ పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో పవర్ ప్లేలో 90 పరుగుల సాధించింది. పవర్ ప్లే తర్వాత నరైన్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్‌తో కలిసి కెప్టెన్ రహానే దూకుడుగా ఆడాడు. 35 బాల్స్‌లో 61 పరుగులు చేసిన రహానే.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 162 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కతా.. 177 పరుగులకు చేరుకునే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో మ్యాచ్ సునాయసంగా లక్నో గెలిచేస్తుందనుకున్నారు. కానీ రింకూ సింగ్ అలా జరగనివ్వలేదు. ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు.
ఇక్కడ లక్నో బౌలర్ల గురించి తప్పక చెప్పుకోవాలి. మంచి కీలక టైమ్‌లో వికెట్స్ తీసుకుని లక్నో మళ్లీ రేసులోకి తీసుకొచ్చారు. క్రీజులో ఉన్న రస్సెల్, రింకూ సింగ్ మ్యాచ్‌ను ముగిస్తారు అనుకునేలోపు… రస్సెల్‌ను శార్దూల్ ఠాకూర్ బోల్తా కొట్టించడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన రింకూ సింగ్ చివరి ఓవర్‌లో 24 పరుగులు కావాల్సి ఉండగా 19 పరుగులు రాబట్టడంతో 4 రన్స్ తేడాతో లక్నో గెలిచింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. తొలి వికెట్‌కే 99 పరుగులు చేశారు. మార్‌క్రమ్, మార్ష్ పరుగుల వరద పారించారు. 47 పరుగుల చేసి మార్‌క్రమ్ ఔట్ కాగా.. మార్ష్ ఏకంగా 81 పరుగులు చేశాడు. ఇక పూరన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 8 సిక్స్‌లు, 7 ఫోర్లు బాది .. 36 బంతుల్లో 87 పరుగులు చేశాడు. దీంతో 238 పరుగులు చేసింది లక్నో.
ఈ గెలుపుతో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది లక్నో. ఇక కోల్‌కతా ఆరో స్థానంలో ఉంది.