గొంగడి త్రిష.. ఇప్పుడీ పేరు ఇండియా వైడ్‌గా మారుమోగిపోతుంది. అండర్-19 వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన ఈ తెలంగాణ బిడ్డ గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ కప్పు ఇండియాకు రావడంతో తన కృషి ఎంతో ఉంది కాబట్టి. బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తూ.. బౌలింగ్‌లో వరుసగా వికెట్లు తీస్తూ.. టీమిండియా వరుస విక్టరీల్లో కీ రోల్ ప్లే చేసింది త్రిష. అందుకే తెలంగాణ షాన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు త్రిషని.
ఎక్కడో భద్రాచలంలో జన్మించిన త్రిష.. మలేసియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలపడంతో ప్రధాన పాత్ర పోషించడం చాలా అరుదనే చెప్పాలి. ఈ మెగా టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన త్రిష.. ఏకంగా 309 పరుగులు చేసింది. ఏడు వికెట్లు తీసింది. ఈ మెగా టోర్నీలో రెండో టాప్ స్కోరర్ ఇంగ్లండ్ క్రికెటర్ పెర్రిన్. ఆమె చేసింది 176 పరుగులు. ఈ రెండింటి మధ్య ఎంత తేడాను చూస్తేనే అర్థమవుతుంది త్రిష డాషింగ్ బ్యాటర్ అని.
మొదటి సెంచరీ త్రిష పేరుపైనే…
ఈ మెగాటోర్నీలో ఇంత వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. కానీ ఆ లోటును తీర్చేసింది త్రిష. నిజానికి వెస్టిండీస్‌తో మొదలైన ఇండియా ప్రయాణం.. దక్షిణాఫ్రికా వరకు కొనసాగడంలో త్రిషది కీలకపాత్రే. అయితే స్కాట్లాండ్‌తో జరిగిన గేమ్ మాత్రం త్రిషకు మోస్ట్ మెమోరబుల్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో 110 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచింది త్రిష. దీంతో ఈ టోర్నీలో తొలి సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా నిలిచింది.
బౌలర్‌గా సత్తా చాటిన త్రిష…
నిజానికి త్రిష పేస్ బౌలర్. కానీ తన బౌలింగ్ శైలిని మార్చుకుంది. లెగ్ స్పిన్నర్‌గా మారింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేసింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా బ్యాటర్లకు సవాల్ విసిరింది. ఫైనల్స్‌లో అయితే ఏకంగా మూడు వికెట్లు తీసింది.
ఇప్పుడే కాదు సరిగ్గా కొన్ని రోజుల క్రితం జరిగిన అండర్ 19 ఆసియా కప్‌లోనూ అదరగొట్టింది త్రిష. మొత్తం టోర్నీలో తన మెరుగైన ఆటతో ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు దక్కించుకుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే చివరి 12 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో త్రిష రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో కలిపి 451 రన్స్ చేసింది.
ఐపీఎల్, టీమిండియాలోకి ఎంట్రీ!
ప్రస్తుతం త్రిష ప్రయాణానికి ఇక అవధులు లేవనే చెప్పాలి. త్వరలోనే WPLలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. దీనికి తోడు టీమిండియా సీనియర్ టీమ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది త్రిష. ఇన్ని అద్భుతాలు సాధిస్తున్న ఈ క్రికెటర్ వయసు కేవలం 19 సంవత్సరాలే. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే మిథాలీరాజ్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్న తెలంగాణ ప్లేయర్ త్రిష కావడంలో డౌటే లేదు.