- హైబ్రిడ్ పద్ధతిలో నిర్మాణం
- రాష్ట్రాభివృద్ధిని మలుపు తిప్పే ప్రాజెక్టు
- రాయలసీమ రతనాల సీమగా మారుతుంది
- సీఎం చంద్రబాబు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ సాగునీటి ప్రాజెక్టుకి రంగం సిద్ధమవుతోంది. రూ.80 వేల కోట్లతో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనకు సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలో నిర్మించబోయే ప్రాజెక్టు
పూర్తయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రిజర్వాయర్ల అనుసంధానం పూర్తి కానుంది. అదే జరిగితే రాయలసీమ రతనాల సీమ కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు వివరాలను ప్రకటించి సంచలనం సృష్టించారు.
సీఎం మాట్లాడుతూ 2024లో 4,114 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్లాయి. ఇకపోతే కృష్ణా నుంచి 2,989 టీఎంసీల నీళ్లు వరదల సమయంలో సముద్రంలోకి వెళ్లాయి. అందుకని ఈ రెండు నదులను అనుసంధానం చేస్తున్నాం. పట్టిసీమ చేపట్టిన తర్వాత సరైన సమయానికి గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు అంది పంటలు చేతికి అందుతున్నాయి. అయితే కృష్ణా, తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఈనేపథ్యంలో గోదావరి నుంచి కృష్ణాకు కనీసం 200 టీఎంసీలు తీసుకురావల్సిన అసవరం ఉంది.
మరోవైపు చూస్తే వరదల సమయంలో తప్ప కృష్ణాలో నీళ్లు ఉండటం లేదు. అదే గోదావరిలో నీటి ప్రవాహం ఉంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కడితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మేలు కలుగుతుంది. అక్కడ కరవు వల్ల సాగు దెబ్బతింటోంది. అక్కడికి నీళ్లు తీసుకువెళ్లగలిగితే ప్రజల ఆర్థిక, సామాజిక జీవన విధానంలో పెను మార్పులు వస్తాయి. నిజంగా ప్రాజెక్టు పూర్తయితే అది చరిత్ర అవుతుంది.
నీటి లభ్యతను బట్టి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ కు రోజుకు కనీసం 2 టీఎంసీల నీటిని తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటాం. ఇది పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 7.5 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. అయితే ప్రాజెక్టు నిర్మించేందుకు 48వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. ఇది నిర్మించాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.
మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తవుతుంది. తొలిదశలో పోలవరం నుంచి క్రష్ణా నదికి నీళ్లు మళ్లించడం తొలిదశ. రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలిస్తాం. మూడోదశలో బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని మళ్లిస్తాం. ఇలా చూస్తే రాయలసీమకు బనకచర్ల గేట్ వే కానుంది.
ఇప్పటికే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖకు, ప్రధాని మోదీకి నివేదించాం. అయితే దీనిని వాళ్లు కూడా భరించలేరు. అందుకే హైబ్రిడ్ పద్ధతిలో ప్రాజెక్టు కట్టాలని భావిస్తున్నాం. అంటే జాతీయ రహదారుల తరహాలోనే ప్రభుత్వం-ప్రైవేటు-భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మించాలని భావిస్తున్నాం. టోల్ గేట్లు తరహాలోనే ట్యాక్స్ వసూళ్లు ఉంటాయి. అయితే వయబిలిటీ గ్యాప్ ఫండ్ వరకు ప్రభుత్వం ఇస్తుంది. ప్రాజెక్టుకి సంబంధించి డీపీఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని అన్నారు.
ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో చర్చ జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పద్ధతిని రాజస్థాన్ లో అమలు చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో ఇక్కడ ముందడుగు వేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ జిల్లాల్లో భావి తరాలకు నీటి సమస్య ఉండదని తెలిపారు. మొత్తానికి చంద్రబాబునాయుడు మళ్లీ తన విజన్ ఏమిటో నిరూపించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఏపీకి మంచి జరగాలని అందరూ కోరుతున్నారు.