23.4 C
Hyderabad
Saturday, August 1, 2026

Live Video

spot_img

తక్షణం ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోండి…

  • ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశం
  • తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ లు

తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారులను తక్షణం తమ హోమ్ క్యాడర్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారిణి అభిలాష బిస్త్, మరో ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిలను 24 గంటల్లోపల ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. తెలంగాణ నుంచి వారు ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ క్యాడర్కు కేటాయించారు. అయితే ఈ ముగ్గురు అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి తమను తెలంగాణలోనే కొనసాగించేలా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఈ పదకొండేళ్లుగా వీరు ముగ్గురు ఐపీఎస్ అధికారులు తెలంగాణలోనే తమ విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ముగ్గురినీ వెంటనే ఏపీ క్యాడర్లో రిపోర్ట్ చెయ్యమని ఆదేశించింది. 1990 బ్యాచ్కి చెందిన అంజనీకుమార్ గత కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన రోడ్ సేఫ్టీ అధారిటీ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఇక 1994 బ్యాచ్ అధికారిణి అయిన అభిలాషా బిస్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా వ్యవహరిస్తున్నారు. గతేడాది డీఓపీటీ ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి, ఎం.ప్రశాంతిలు ఏపీ క్యాడర్లో చేరిపోయారు. తాజా హోంశాఖ ఉత్తర్వులతో ఐపీఎస్ అధికారులైన అంజనీకుమార్, అభిలాషాబిస్త్, అభిషేక్ మహంతీలు 24 గంటల్లోగా ఏపీ క్యాడర్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com