ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రాంతంలో సొంతంగా నిర్మించుకోబోతున్న ఇంటి నిర్మాణ పనులు రేపు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. సరిగ్గా ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య శంకుస్థాపనకు వేద పండితులు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో, చంద్రబాబుకు చెందిన స్థలంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్థలం మొత్తం చదును చేయించారు.
వెలగపూడిలోని ఈ ఐదు ఎకరాల స్థలంలో ఒక వైపు ఇంటి నిర్మాణం, మరోవైపు.. కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు ప్లాన్ రూపొందించారు. చుట్టూ నాలుగు వైపులా రోడ్లు నిర్మిస్తున్నారు. సచివాలయం వెనుక భాగంలో హైకోర్టుకు సమీపంలో చంద్రబాబు ఈ ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ వేసిన చంద్రబాబు.. అప్పుడే విశాలమైన ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఏడాదిన్నర లోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్య్ంగా పెట్టుకున్నారని చెబుతున్నారు.