కరీంనగర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ సంఘటనలో 23మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వాళ్లందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కరీంనగర్ పట్టణంలోని శర్మనగర్‌లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించే సమయంలో విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. కడుపునొప్పితో పాటు.. వాంతులు చేసుకున్నారు. దీంతో, అర్థరాత్రి వేళ అప్పటికప్పుడు పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు గురైన 19 మంది విద్యార్థినులను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మరికొందరు విద్యార్థినులు కూడా అస్వస్థతకు గురి కావడంతో వాళ్లను కూడా ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది.అయితే, ప్రస్తుతం అందరి పరిస్థితీ మెరుగైందని, భయంలేదని వైద్యులు చెబుతున్నారు.
హాస్టల్‌లో సోమవారం రాత్రి భోజనంలో క్యాలీఫ్లవర్, సాంబార్‌తో భోజనం చేసిన విద్యార్థులు.. స్టడీ అవర్స్ ముగించుకొని తమ గదుల్లోకి వెళ్లి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఈ పరిస్థితి తలెత్తింది. కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు.అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.