పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అయిన వాళ్లందరూ లేకున్నా, కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నా… చివరిదాకా నిలిచి ఉండేది వివాహ బంధం ఒక్కటే. మన సంస్కృతిలో కూడా ఇదో భాగం. ఇది మనమందరం ఫాలో అవుతున్నదే. కానీ, కొన్నేళ్లుగా కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. క్షణికావేశాలు దంపతుల మధ్య అగాథం పెంచుతున్నాయి. పట్టింపులు ఇద్దరి జీవన విధానంపైనా తీవ్రస్తాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. చివరికి వాళ్ల జీవితంపై ముద్ర వేస్తున్నాయి. కోలుకోలేని పరిణామాలకు కారణమవుతున్నాయి.
ఇప్పుడు తమిళనాడులో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇంట్లో భార్యా భర్తలు ఇద్దరే ఉంటారు. కాకపోతే ఒకరు కింది అంతస్తులో, మరొకరు మేడపై గదిలో ఉంటారు. పిల్లలందరూ వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ఇప్పుడు మేడమీద గదిలో ఉంటున్న భర్త చనిపోయాడు. కానీ, ఆరు రోజుల దాకా భార్య గమనించలేదు. చివరికి దుర్వాసన వస్తోందని పై గదిలో చూస్తే.. కుళ్లిన స్థితిలో భర్త మృతదేహం కనిపించింది. ఈ పరిణామం అందరినీ ఆలోచింపజేసింది. కుటుంబ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చను లేవనెత్తింది.
ఆ దంపతులిద్దరి మధ్యా ఏదో ఓ బలహీన క్షణంలో గొడవ జరిగింది. అంతే.. మాట్లాడుకోవడం మానేశారు. అప్పటికే ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు.పిల్లలు కూడా పెళ్లిళ్లయి తలోచోటికి వెళ్లిపోయారు. భర్త రిటైర్ అయ్యారు. రోజులు గడిచాయి. సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. కానీ ఇద్దరి మధ్యా మాటలు మాత్రం మొదలు కాలేదు. ఎవరూ జోక్యం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అలా పదేళ్లు గడిచింది. ఇప్పుడు భర్త ఇంట్లోనే ఉన్నా.. అనాథలా చనిపోయి శరీరం కుళ్లిపోయింది. ఈ సంఘటన తమిళనాడులోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
దంపతుల మధ్య ఏర్పడే అగాధం ఎంతటి విపరీతానికి దారి తీస్తుందో ఈ యదార్థ సంఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఒకే ఇంట్లో ఉంటున్నా ఆ భార్యా భర్తల మధ్య పదేళ్లుగా మాటలు లేవు. దీంతో భర్త ఏమయ్యాడో కూడా భార్య కనీసం ఆరా తీయలేదు. తెలుసుకోవడానికి ఆరు రోజుల పాటు ప్రయత్నించలేదు. ఎట్టకేలకు ఆరు రోజుల తర్వాత ఇంట్లోనే పడివున్న అతడి మృతదేహాన్ని గుర్తించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది.
కోయంబత్తూర్‌లోని ఇరుగూర్ ఈశ్వరన్ ఆలయ వీధిలో వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. 73 యేళ్ల రాజమాణిక్యం, 63యేళ్ల రాజసులోచన దంపతులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పిల్లలిద్దరికీ పెళ్లి కావడంతో వాళ్లిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. అయితే, రాజమాణిక్యం, రాజసులోచన దంపతుల మధ్య తలెత్తిన విభేధాతో పది సంవత్సరాలుగా వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. మేడపై ఉన్న గదిలో రాజమాణిక్యం ఉంటున్నారు. కింద పోర్షన్‌లో రాజసులోచన ఉంటోంది. రాజమాణిక్యం, రోజూ మేడపైనుంచి కిందికి వచ్చి భోజనం, తాగునీళ్లు తీసుకెళ్లేవాడు. అయితే, గతనెల 29వ తేదీన చివరి సారిగా మధ్యాహ్నం కిందికి వచ్చి.. భోజనం, నీళ్లు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కిందికి రాలేదు. ఆరు రోజులైనా రాజమాణిక్యం కిందికి రాకపోవడం, భోజనం తీసుకు వెళ్లకపోవడంతో వేరే ఊరికి వెళ్లి ఉంటాడని రాజసులోచన భావించింది. అయితే, శనివారం రాత్రి మేడ పైనున్న గది నుంచి దుర్వాసన రావడంతో రాజసులోచన అక్కడికి వెళ్లి చూసింది. తలుపు మూసి ఉంది. కిటికీ నుంచి లోపలికి తొంగి చూడటంతో హతాశురాలైంది. రాజమాణిక్యం మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.