25.1 C
Hyderabad
Thursday, August 6, 2026

Live Video

spot_img

తానాలో 30 కోట్ల స్కామ్‌ ప్రకంపనలు – అమెరికా కోర్టు నోటీసులు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా – తానాలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. తానాకు సంబంధించిన రూ.30కోట్ల నిధులు దారి మళ్లాయన్న ఆరోపణలపై అమెరికాలోని ఓ న్యాయస్థానం తానాకు నోటీసులు జారీచేసింది. ఈ పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది.

అమెరికాలో ఎన్నారైలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి అమెరికాలో నివసిస్తున్న వాళ్లు చాలా రంగాల్లో ఇన్‌ఫ్లూయెన్స్‌ చూపిస్తున్నారు. ప్రత్యేకంగా తెలుగు వాళ్లకు సంబంధించినవే పలు అసోసియేషన్లు మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్‌ అమెరికా – తానా గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అయితే, తానా ఫౌండేషన్‌కు సంబంధించి పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలున్నాయి. ఈ నిధుల దుర్వినియోగం వ్యవహారం అమెరికాలోనే కాదు..ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తానా ఫౌండేషన్‌ మాజీ కోశాధికారి శ్రీకాంత్‌ పోలవరపు సుమారు నాలుగు మిలియన్‌ డాలర్ల నిధులను తన సొంత సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆ నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు తానాకు నోటీసులు జారీ చేసింది. తానాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని పత్రాలు, డిజిటల్‌ డేటాను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది.

గత యేడాది డిసెంబర్‌లో తానాలో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న వ్యవహారం బయటకు వచ్చింది. అప్పుడే దీనిపై కేసు నమోదయ్యింది. తానాకు విరాళాలుగా వచ్చిన నిధుల నుంచి సుమారు నాలుగు మిలియన్‌ డాలర్లను తానా మాజీ కోశాధికారి శ్రీకాంత్‌ పోలవరపు తన సొంత కంపెనీ అయిన బృహత్‌ టెక్నాలజీస్‌కు ట్రాన్సఫర్‌ చేశాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఇదంతా ఒక్కసారిగా కాకుండా.. నిధుల మళ్లింపు వ్యవహారం దాదాపు రెండు సంవత్సరాలుగా విడతల వారీగా కొనసాగిందని చెబుతున్నారు. భారతీయ కరెన్సీలో దాదాపు 30 కోట్ల రూపాయలు దారి మళ్లాయన్న పరిణామం దాతలకు కూడా షాక్‌ ఇచ్చింది. ఈ ఆరోపణలు వచ్చిన సమయంలోనే శ్రీకాంత్‌.. తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పదవికి రాజీనామా చేశారు. తానా అకౌంట్‌కు ఒక మిలియన్‌ డాలర్లు తిరిగి చెల్లించినట్లు కార్యవర్గ సభ్యులు చెబుతున్నారు. మిగతా మొత్తాన్ని గత డిసెంబర్‌ 15వ తేదీ లోగా తిరిగి చెల్లిస్తానని శ్రీకాంత్‌ మాటిచ్చారని చెబుతున్నారు.అయితే, ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో ఈ వ్యవహారం కోర్టులోకి వెళ్లింది. కాలిఫోర్నియా న్యాయస్థానం ఇప్పుడు సమన్లు జారీచేసింది.

ఈ ఘటన తెలుగు ఎన్నారైల్లో షాకింగ్‌గా మారింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. కేవలం ఒక వ్యక్తి ఇతర సభ్యులు ఎవరికీ తెలియకుండా సుమారు 4 మిలియన్ డాలర్లను తన సొంత కంపెనీఇక దారి మళ్లించడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరుకావాలని.. ఆ సమాచారాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ -ఎఫ్.బీ.ఐకి మెయిల్ చేయాలని ఆదేశించింది. విచారణకు వచ్చే సమయంలో ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు సాఫ్ట్ కాపీలు కూడా తీసుకురావాలని కోరింది. దీంతో.. ఈ విషయం అమెరికా తెలుగు కమ్యునిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com