తిరుమల గిరులపై సోమవారం వరుస దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం స్వామివారి లడ్డూ కౌంటర్ వద్ద అగ్ని ప్రమాదం జగింది. 47వ నెంబరు లడ్డూ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కౌంటర్‌లోని కంప్యూటర్‌కి సంబంధించిన యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చలరేగి ఆవరణ అంతా దట్టమైన పొగ కమ్ముకు పోయింది. ఈ సంఘటనకు భయభ్రాంతులకు గురైన భక్తులు కౌంటర్ వెలుపలకు పరుగులు తీసారు. లడ్డు కౌంటర్ వద్ద ఎల్లప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే వెంటనే సిబ్బంది లడ్డూ కౌంటర్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
లడ్డూ కౌంటర్‌లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించిన సంఘటన మరవక ముందే మధ్యాహ్నం వేళ తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. భక్తులను తీసుకుని వెళుతున్న ఆర్టీసీ బస్సు ఘూట్ రోడ్డులో ప్రమాదానికి గురయ్యింది. ఘాట్ రోడ్డులో ఒక మలుపు వద్ద బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది భక్తులకు తీవ్ర గాయాలు అవ్వగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.