- బీఎన్‌ఎస్ 111, 67 సెక్షన్లు ఈ కేసులో చెల్లవన్న కోర్టు
- పోసానికి రిమాండ్ విధించడం సరికాదన్న లాయర్ పొన్నవోలు
సినీ నటడు పోసాని కృష్ణమురళి కేసులో అతనిపై బీఎన్‌ఎస్ 111, 67 సెక్షన్లు పెట్టడం సరికాదని, ఈ కేసులు ఆ సెక్షన్లు వర్తించవని రైల్వేకోడూరు కోర్టు తేల్చి చెప్పింది. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పోసాని కృష్ణమురళిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. రాత్రితెల్లవార్లు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల వరకూ అంటే దాదాపు ఎనిమిది గంటల పాటు పోసాని కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల అనంతరం బీఎన్‌ఎస్ 111, 67 సెక్షన్లు ఈ కేసులో వర్తంచవని చెప్పిన కోర్టు పోసానికి మార్చి 13 వరకూ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. కోర్టు నిర్ణయం అనంతరం పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. అంతకు ముందు పోసాని తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి బీఎన్‌ఎస్ 111 యాక్ట్ పోసానిపై నమోదు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవస్ధీకృత నేరాలు చేసే వారికి మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు. పొన్నవోలు వాదనతో రైల్వేకోడూరు కోర్టు ఏకీభవించింది. అనంతరం పోసాని లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోసాని కేసులో బీఎన్‌ఎస్ 111, 67 సెక్షన్లు వర్తించవని కోర్టు చెప్పినప్పటికీ రిమాండ్ విధించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ విధించకూడదని, అందువల్ల దీనిపై కోర్టు ధిక్కరణ కింద కేసు వేస్తామని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.