కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతులు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గుంటూరు మిర్చియార్డ్‌ని సందర్శించి మిర్చి రైతుల కష్టాలు అడిగి తెలుసుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏ ఒక్క రైతూ ఆనందంగా లేరని అన్నారు. ప్రస్తుతం రైతుల దీనస్ధితికి కూటమి ప్రభుత్వమే కారణమని జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. గతంలో వైసీపీ పాలనలో రైతులకు చేసిన మేలును ఈ సందర్భంగా జగన్ వివరించారు. మా హయాంలో మిర్చి రైతులకు 21 వేల నుంచి 27 వేల రూపాయల దాకా గిట్టుబాట ధర వచ్చేదని వివరించారు. అలాగే పెట్టుబడి సహాయం ఇచ్చి రైతులను ఆదుకున్నట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడి సహాయం ఇవ్వడం లేదని, సున్నా వడ్డీ రుణాలు కూడా రాని పరిస్ధితి దాపురించిందని చెప్పారు. ఇక మిర్చి రైతల అవస్ధలను అయితే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని, రైతులు తాము పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్ధితిల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంటకు కనీసం 11వేలు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్ధితులు నెలకొన్నాయన్నారు. ఆర్బీకే వ్యవస్ధలను నిర్వీర్యం చేశారని అందువల్ల ఎరువులను బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్ధితులు మళ్ళీ వచ్చాయని విమర్శించారు. చంద్రబాబు వెంటనే గుంటూరు మిర్చి యార్డ్‌కు వచ్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకోవాలని వైఎస్.జగన్ డిమాండ్ చేశారు.