22.6 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి తిట్ల దండకం – సీఎంఓ ఆరా

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలో స్వామివారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ బోర్డు సభ్యుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. నిబంధనల గురించి చెప్పిన ఉద్యోగిపై టీటీడీ బోర్డు సభ్యుడు దూషణకు పాల్పడ్డాడు. సహనం కోల్పోయి స్వామివారి ఆలయం ముందే ఉద్యోగి పట్ల అవమానకరంగా వ్యవహరించాడు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్‌కుమార్‌ తతంగం వీడియోలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గోవిందా…! ఇలాంటి వాళ్లకు ధర్మ కర్తల మండలిలో చోటిచ్చారా? అంటూ శ్రీవారి భక్తులు విస్తుపోతున్నారు. దీంతో, ఈ వ్యవహారంపై అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు..సీఎంఓ కార్యాలయం ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసింది.

బోర్డు సభ్యుడి బూతు పురాణం :

విధుల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిపై అదే బోర్డు సభ్యుడు బూతులతో విరుచుకుపడటం కలకలం రేపుతోంది. మహా ద్వారం తలుపులు తీయలేదని టీటీడీ ఉద్యోగిని బోర్డు సభ్యుడు నరేష్‌ చేత్తో నెట్టేస్తూ బూతులు తిట్టాడు. ఈ తతంగమంతా వీడియోలలో రికార్డైంది. మంగళవారం ఈ సంఘటన జరిగింది. స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మహాద్వారం నుంచి బయటికి పంపక పోవడంతో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. భ క్తులు చూస్తుండగానే టీటీడీ ఉద్యోగి బాలాజీపై బూతు పురాణం అందుకున్నాడు. నరేష్‌ వ్యవహరించిన తీరుతో, అక్కడున్న తోటి ఉద్యోగులతో పాటు.. భక్తులు కూడా అవాక్కయ్యారు.

బెంగళూరుకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌.. మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బంధువులతో కలిసి ఆలయం ముందున్న మహా ద్వారం వద్దకు చేరుకు న్నారు. ఆ సమయంలో బోర్డు సభ్యుడి వెంట ఉన్న ఓ వ్యక్తి మహాద్వారం తలుపులు తీయాలని అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీకి సూచించారు. అయితే, మహా ద్వారం గేటు నుంచిఎవరినీ పంపడం లేదని, ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే తలుపులు తీస్తానని బదులిచ్చాడు. ఆ సమాధానం వినగానే.. ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన బోర్డు మెంబర్‌ నరేష్‌ కుమార్‌.. బాలాజీపై తిట్లు అందుకున్నాడు. ఎవరితో ప్రవర్తించాలో తెలియదా అంటూ.. నువ్వు బయటకు పో.. అంటూ రెచ్చిపోయారు.

థర్డ్‌ క్లాస్‌ నా కొడకా.. అంటూ తిట్ల దండకం :

తిరుమలలో వీఐపీలు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయం బయటకు వచ్చే సమయంలో మహాద్వారం, గొల్లమండపం మధ్య తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. దీంతో, లోపలినుంచి బయటకు వచ్చేభక్తులు బయోమెట్రిక్‌ వైపుగానే రావాలని సూచిస్తున్నారు. అయితే, మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న బెంగళూరుకు చెందిన నరేశ్‌ కుమార్‌ కుటుంబసభ్యులు గేటు తీయాలని మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీని ఆదేశించారు. బయోమెట్రిక్‌ మార్గంలో వెళ్లాలని బాలాజీ చెప్పడంతో నరేశ్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఎవడ్రా నువ్వు అంటూ మండిపడ్డారు.. పోరా బయటకి! థర్డ్‌క్లాస్‌ నా.. కొడకా, బయటకి పంపండి ఇతడిని, లేకుంటే ఇక్కడే కుర్చునేస్తాను’ అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. టీటీడీ ఉద్యోగి బాలాజీ భుజంపై చేయి వేసి నెట్టేశారు.

వాస్తవం ఏంటి? :

వాస్తవానికి టీటీడీ బోర్డు సభ్యులను మహాద్వారం గుండా అనుమతించాలనే నిబంధన లేదు. మహాద్వారం నుంచి బంధుమిత్ర సపరిపారంగా రాకపోకలు సాగించడం రివాజుగా మారింది. ఉద్యోగి తన విధులు నిర్వర్తించినందుకు బూతులు తిట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ వ్యవహారాన్ని గమనించిన టీటీడీ అధికారులు సర్దిచెప్పారు. టీటీడీ వీజీఓ సురేంద్ర, పోటు ఏఈఓ మునిరత్నం తదితరులు.. బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్‌కు సర్దిచెప్పి మహద్వారం గేటు తీసి బయటకు పంపారు. ఉద్యోగి బాలాజీని కూడా అక్కడి నుంచి పంపించేశారు.

రంగంలోకి విజిలెన్స్ అధికారులు :

టీటీడీ బోర్డు మెంబర్‌ నరేష్ కుమార్‌ వ్యవహారంపై వీడియో బయటకు రావడం, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు రెస్పాండ్‌ అయ్యారు. నిబంధనలు పాటించాలని చెప్పినందుకు.. ఆ మార్గదర్శకాలు, నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యతాయుత హోదాలో ఉండి.. ఉద్యోగిపైనే బూతు పురాణం అందుకున్న బోర్డు సభ్యుడి తీరు వివాదాస్పదం కావడంతో అధికారులు నష్ట నివారణ చర్యల్లో పడిపోయారు. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ముందుగా టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌ స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. పూర్తి వివరాలను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు.. ఉన్నతాధికారులకు పంపించారు.

బోర్డు మెంబర్‌ తీరుపై సీఎంఓ ఆరా :

కాగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్‌ కుమార్‌ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, విజిలెన్స్‌ విభాగంతో సీఎంఓ అధికారులు మాట్లాడినట్లు తెలుస్తోంది. మంగళవారం స్వామివారి దేవాలయం ప్రాంగణంలో జరిగిన వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. అయితే,బోర్డు సభ్యుడి దురుసు ప్రవర్తన, టీటీడీ ఉద్యోగి విధి నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. ఎలాంటి ఆదేశాలు వెలువడతాయనేది చర్చనీయాంశమయ్యింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com