తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలోనే కాదు.. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనం కేటాయింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మరి.. ఈ వార్తల్లో నిజమెంత? టీటీడీ ఏం చెబుతోంది? భాస్కర న్యూస్ ఫ్యాక్ట్‌చెక్‌లో చూద్దాం…
జరుగుతున్న ప్రచారం :
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుందని, తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసుల లేఖలు వారంలో రెండు సార్లు పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు జారీచేసే లేఖలతో తిరుమలలో భక్తులకు వసతి, దర్శన సదుపాయాలు కల్పించేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం విభజిత ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు పనిచేయడం లేదు. ఈ అంశంపై చాలా రోజుల నుంచి వివాదం నెలకొంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలకు దర్శనం, వసతి సదుపాయం కల్పించాలన్న డిమాండ్లు ఇక్కడి నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈ అంశంపై కదలిక వచ్చిందని తెలుస్తోంది. త క్రమంలోనే టీటీడీ పై నిర్ణయం తీసుకుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
టీటీడీ ఈవో క్లారిటీ :
తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కేటాయింపు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈవో శ్యామలరావు ఖండించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు. వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు స్వీకరిస్తారని కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో క్లారిటీ ఇచ్చారు.
వైరల్ అవుతున్నదేంటి ?
తిరుమలలో శ్రీవారి దర్శనంకోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకుంటారు.
వాస్తవం ఏంటి ?
ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీటీడీ ఈవో శ్యామలారావు మీడియాకు ఈమేరకు స్పష్టత ఇచ్చారు.
భాస్కర న్యూస్ ఫ్యాక్ట్‌చెక్ :
సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం. భాస్కర న్యూస్ ఫ్యాక్ట్‌చెక్ పరిశీలనలో ఈ విషయం వెల్లడయ్యింది.