– మాజీ సీఈసీ తేనెతుట్టె కదిపారా?
ఈవీఎం. ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్. బ్యాలట్‌పేపర్‌కు బదులు వోటింగ్ ప్రక్రియలో కీలకంగా నిలిచే సాంకేతిక యంత్రం. అయితే, వోటింగ్ మిషనే కాదు.. ఈ వోటింగ్ సిస్టంపైనే వివాదాలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఇప్పుడు భారత రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశం. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. ఫలితాల తర్వాత కొద్దిరోజుల పాటు విస్తృతంగా చర్చ జరుగుతోన్న పరిస్థితి. ఆ తర్వాత షరా మామూలుగానే చర్చల్లోంచి వెనకకు జారుకుంటోంది. మళ్లీ ఎక్కడైనా పోలింగ్ జరిగి ఫలితాలు విడుదలైన తర్వాత ముందువరుసలోకి వచ్చి కూర్చుంటోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. ఈవీఎంలపై మరోసారి చర్చ మొదలైంది. విపక్షాల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. వివాదాల అలలు మరోసారి ముంచెత్తుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వివాదాలు నెలకొంటున్న ప్రతిసారీ వివరణలు ఇస్తోంది. ఆ తర్వాత సైలెంట్ అయిపోతోంది.
అసలు ఈవీఎంల ద్వారా ఓటింగ్ వివాదం ఇదే మొదటిసారి కాదు. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినప్పటినుంచీ ఈవీఎం ఓటింగ్‌పై విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ ఈవీఎంలను మేనేజ్ చేయగలుగుతుందని, ఈ పోలింగ్ పద్ధతిని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ప్రతిసారీ వస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే కాదు.. మొన్నటికి మొన్న హర్యానాలో ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడ్డాక ఇవే సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ఈ తరహా అనుమానాలు విపక్షాల నుంచి వచ్చాయి. అంతెందుకు..? 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఈసీ విడుదల చేసిన జాబితా ప్రకారం పోలైన ఓట్లకంటే కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లు ఎక్కువ వచ్చాయని లెక్కలు చెప్పాయి. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లోనూ ఈవీఎంల పనితీరుపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్ పద్ధతిని రద్దు చేయాలన్న డిమాండ్లు రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశాలున్నాయని, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు కావడంతో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఈ పద్ధతి ఇలాగే కొనసాగిస్తే.. ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్న వాదనలు కూడా ఎక్కువవుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అధికార దుర్వనిఇయోగానికి పాల్పడిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ విమర్వించారు. ఆర్‌ఎస్పీ అధినేత మహదేవ్ ఝాంకర్ కూడా ఈవీఎంలను హ్యాక్ చేశారని నేరుగా ఆరోపించారు. అక్కల్‌కోట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తమ పార్టీ అభ్యర్థి బంద్‌గర్ సొంతగ్రామంలో ఆయనకు సున్నా ఓట్లు రావడమేంటని ప్రశ్నించారు. ఇదంతా ఈవీఎంల మహిమే అని దుయ్యబట్టారు. ఈవీఎంల వినియోగంలో అవకతవకలు జరిగాయంటూ సామాజిక కార్యకర్త బాబా అధవ్ మూడురోజుల పాటు నిరసన చేపట్టారు. ఈవీఎంల వినియోగంపై ప్రజల్లో తిరుగుబాటు రావాలని కూడా ఆకాంక్షించారు.
ఇక, మొన్నటి హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఇదే చర్చ నడిచింది. అక్కడ ఎగ్జిట్‌పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పాయి. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పడంపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. మరోవైపు.. హిస్సార్, మహేంద్రఘడ్, పానిపట్ జిల్లాల్లో బ్యాటరీల చార్జింగ్ 99శాతం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు గుర్తించారు. కాంగ్రెస్‌పార్టీ విజయ సాధించిన ప్రాంతాల్లో ఈవీఎంల బ్యాటరీ చార్జ్ 70శాతమే ఉండగా.. బీజేపీ గెలిచిన స్థానాల్లో ఈవీఎంల బ్యాటరీ చార్జ్ 99శాతం ఉండటం ఎలా సాధ్యమని కాంగ్రెస్‌పార్టీ ప్రశ్నించింది.దీన్ని బట్టి ఎంపిక చేసుకున్న కొన్ని కేంద్రాల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగి ఉంటుందని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నా ఈసీ పూర్తి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌పార్టీ ఆరోపించింది.
మరోవైపు.. అంతకుముందు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అనుమానాలు ఉన్నచోట వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించాలని పోటీ చేసిన అభ్యర్థులు ఈసీకి చేసిన విజ్ఞప్తులు కూడా చెత్తబుట్ట దాఖలయ్యాయి. ఒంగోలు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో, విజయనగరం పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థులు వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించాలని వైసీపీ అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేశారు. కానీ, ఈసీ మాత్రం వీవీప్యాట్‌లకు బదులు.. మాక్ పోలింగ్ జరుపుతామని సమాధానమిచ్చింది. అభ్యర్థులు విన్నవించుకున్నా.. వీవీప్యాట్లు లెక్కించకుంటే.. అసలు ఆ సిస్టం ఎందుకన్న ప్రశ్నలు వచ్చాయి. ఈ పరిణామం కూడా ఈసీ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉంది. ఆసమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేశారు. బ్యాలట్ ఓటింగ్ సిస్టం మళ్లీ ప్రవేశపెట్టాలని అభిప్రాపయడ్డారు. మొన్న హర్యానా ఎన్నికల అనంతరం కూడా ఎక్స్ వేదికగా తన ఒపీనియన్ షేర్ చేశారు. ఏపీలో మాదిరిగానే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితం ప్రజలను గందరగోళంలో పడేసిందని వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. అమెరికా సహా పలు ప్రజాస్వామ్య దేాల్లో ఈవీఎంల వాడటం లేదని, పేపర్ బ్యాలెట్‌నే వినియోగిస్తున్నారని, మన దేశంలోనూ ఈవీఎంల సిస్టం రద్దయి.. పూర్తిస్థాయిలో పేపర్ బ్యాలెట్ ఎన్నికలే రావాలని సూచించారు.
ఏపీ విషయానికి వస్తే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఈవీఎంల పనితీరుపై పలుమార్లు సందేహాలు లేవనెత్తారు. 2009లో ఈవీఎంల టాంపరింగ్‌పై చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడమే కాదు.. ఈవీఎంల టాంపరింగ్ ఎలా చేయొచ్చో.. కొందరు నిపుణులతో ఏకంగా ఢిల్లీలోనే డమ్మీ ఈవీఎంలో ప్రెజెంటేషన్ కూడా ఇప్పించారు. 2014లో గెలిచిన తర్వాత ఈ ప్రస్తావనే చేయలేదు. అయితే, 2019లో ఓడిపోయిన తర్వాత మరోసారి ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేశారు. అంతేకాదు.. ఈవీఎంలపై కోర్టు మెట్లెక్కారు. ఈ యేడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈవీఎంల ట్యాంపరింగ్ ప్రస్తావన పక్కనబెట్టేశారు.
ఇక, తాజా పరిణామాలు చూస్తే.. ఈవీఎంల ద్వారా ఓటింగ్ పద్ధతిపై భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి పలు సందేహాలు వ్యక్తం చేశారు. కీలక అంశాలపై సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని కుండబద్దలు కొట్టారు. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ వివాదంపై ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయంత్రం పోలింగ్ ముగిసన సమయంలో ప్రకటించిన పోలింగ్ శాతానికి, మరుసటి రోజు ఉదయం ప్రకటించిన పోలింగ్ శాతానికి భారీగా వ్యత్యాసం ఉండటంపై ఖురేషీ ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు 58శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అయితే, మరుసటిరోజు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో పోలింగ్ శాతం 66.05శాతానికి పెరిగింది. అంటే.. మొత్తం పోలింగ్ శాతంలో 8శాతానికి పైగా ఓటింగ్ పెరిగింది. ఓటింగ్‌శాతానికి సంబంధించిన లెక్కలు ఎప్పటికప్పుడు ఫారం–17 సీలో నమోదవుతూనే ఉంటుందన్న ఖురేషి.. మరుసటిరోజు ప్రకటించిన తుది ఫలితాల శాతంలో భారీగా తేడా ఉండటం కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమేనన్నారు. ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదన్నారు మాజీ సీఈసీ. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిసారీ అనుమానాలు కలుగుతూనే ఉన్నాయని, వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పడాలంటే ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారాల్సిన ఆవశ్యకత ఉందన్నారు మాజీ సీఈసీ ఖురేషీ. లేదంటే మొత్తం వ్యవస్థల మీదే ప్రజలకు నమ్మకం పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఈసీ ఖురేషీ అనుమానాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గత మే 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా పరిణామం చోటు చేసుకుందన్న అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. పోలింగ్ రోజున రాత్రి 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 68.12శాతం పోలింగ్ జరిగిందని ఈసీ ప్రకటించింది. అదే రోజు రాత్రి 11.45 గంటలకు 76.50శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత పీలో జరిగిన తుది పోలింగ్ 8.66శాతంగా ప్రకటించింది. అంటే.. పోలింగ్ రోజు తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, తుది పోలింగ్ శాతానికి 12.54శాతం వ్యత్యాస కనిపించింది. అదే సమయంలో ఎన్నికలు జరిగిన ఒడిశాలోనూ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య వ్యత్యాసం 12.48శాతంగా ఉంది.
పై పరిణామాల నేపథ్యంలో ఈవీఎంల వినియోగంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన అమెరికా సహా పలు ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటికీ బ్యాలట్ పద్ధతిలోనే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈవీఎంలను వాడటం లేదు. ఇప్పుడు మనదేశంలో కూడా బ్యాలట్ పద్ధతినే పునరుద్ధరించాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి.