- సమీకరణాల చట్రంలో ఎంపిక ప్రక్రియ
- కసరత్తుపై కేడర్లో కన్ఫ్యూజన్
- అన్నీ టీడీపీకేనా.. మిత్రులకూ వాటా ఉందా..?
- భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బీజేపీకి ఒక సీటిస్తారా…?
- ఈ తడవ జనసేనకు మొండి చెయ్యేనా…?
ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కబోతున్నాయి. ఖాళీ అయిన మొత్తం మూడు సీట్లు కూటమికే దక్కుతాయి. అయితే ఈ మూడు సీట్లలో కూటమి భాగస్వామ్యపక్షాలు తలొకటీ తీసుకుంటాయా లేక అత్యధిక స్ధానాలున్న టీడీపీనే మూడూ తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్లు, పార్టీ కోసం కష్టపడిన వారు, పార్టీకి తెర వెనుక యంత్రాంగం.. మంత్రాంగం నడిపించిన వారు.. ఇలా రకరకాల కేటగిరిలను తీసుకోవడంతో పాటు.. సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉండడంతో ఈసారి కసరత్తు చాలా ఆచి తూచి చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, షరీఫ్ వంటివారికి ఇస్తే బాగుంటుందనే చర్చ ఓ వైపు జరుగుతోంది. అలాగే వర్ల రామయ్య, టీడీ జనార్దన్, కంభంపాటి రామ్మోహన్ వంటి వారు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. వీరు కాకుండా.. టీడీపీ వైపు నుంచి ఇంకొన్ని ఆసక్తికర పేర్లూ తెర మీదకు వస్తున్నాయి. వీరిలో కిలారు రాజేష్, సానా సతీష్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మేనేజ్మెంట్ కోటాలో గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణలు పోటీలో ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
సీనియర్లుకు దక్కేనా..?
యనమల విషయానికొస్తే.. యనమల సీనియర్ అయినా.. రాజ్యసభ దక్కించుకునేందుకు కావాల్సిన అన్ని అర్హతలున్నా.. ఇప్పటికే యనమల ఫ్యామ్లీకి.. బంధువర్గానికి మొత్తంగా మూడు టిక్కెట్లు ఇచ్చింది టీడీపీ అధినాయకత్వం. ఈ క్రమంలో యనమలకు ఇవి మైనస్ పాయింట్లుగా ఉన్నాయి. ఇక అశోక్ గజపతి రాజు పేరూ వినిపిస్తోంది. అయితే ఆయని ఫ్యామ్లీకి కూడా ఓ ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చారు. పైగా గతంతో పోల్చుకుంటే అశోక్ గజపతి రాజు పెద్దగా యాక్టీవుగా ఉన్నట్టు కన్పించడం లేదనే చర్చ ఉంది.
సిన్సియార్టీ పని చేసేనా..?
ఇక వర్ల రామయ్య పరిస్థితి కూడా అదే. వర్ల రామయ్య గతంలో రాజ్యసభకు నామినేషన్ వేసినా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి.. అది దక్కకుండా పోయింది. ఇక 2014-19 మధ్య కాలంలో వర్ల రామయ్యకు నామినేషన్ వేయడం దాదాపు ఖాయమనే పరిస్థితి వచ్చినా.. సడెనుగా కనకమేడల రవీంద్ర కుమార్ తెర పైకి వచ్చారు. దీంతో వర్లకు ఛాన్స్ దక్కకుండా పోయింది. ఇక టీడీ జనార్దన్, కంభంపాటి రామ్మోహన్ వంటి వారు సీనియర్లుగా ఉన్నారు. వారు ప్రస్తుతం ఎలాంటి పదవుల్లో లేరు. అయితే వీరిద్దరు అధిష్టానం వద్ద గుడ్ లుక్స్ లో లేరనే చర్చ జరుగుతోంది. ఇలా పార్టీలో ఎవరో ఒకరికి ఏదో మైనస్ పాయింట్ కన్పిస్తూనే ఉంది. ఇదంతా ఆయా అశావహులకు టిక్కెట్లు ఇవ్వకూడదని భావించినప్పుడు తెరపైకి వచ్చే అంశాలు. ఇక ఇవ్వాలని భావిస్తే.. దానికి కారణాలు చూపడానికి చాలానే ఉంటాయి.
తెర ముందుకొస్తారా..?
ఇక మరో ఇద్దరు పేర్లు ఇటీవల కాలంలో చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. పైగా ఇవి సంచలనంగా మారాయి. వీరిలో కిలారు రాజేష్ ఒకరు. లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు కిలారు. అంతే కాకుండా.. పార్టీలో ఏం జరగాలన్నా ప్రస్తుతం కిలారు మాటే ఫైనల్ అనే పరిస్థితి వచ్చింది. పార్టీ బ్యాక్ ఆఫీస్ వ్యవహరం అంతా కిలారు రాజేషే నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కిలారు రాజేష్ పేరు బలంగా వినిపించినా.. ఇటీవల కిలారు రాజేష్ మీద విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న ప్రతి అనర్ధానికి.. పార్టీ నష్టం కలిగించే ప్రతి నిర్ణయానికి.. ప్రభుత్వంలో కొన్ని కీలక పోస్టింగులకు.. కారణం కిలారు రాజేషేననే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పైగా పార్టీని లీడర్లల్లో.. కేడర్లో వీకెన్ చేసేలా కిలారు వ్యవహరాలు ఉంటున్నాయనేది ఆయన మీదున్న ప్రధానమైన విమర్శ. ఈ పరిస్థితుల్లో కిలారు రాజేష్ రాజ్యసభ టిక్కెట్ ఎంత వరకు దక్కించుకుంటారో చూడాల్సి ఉంది. ఇక రాజ్యసభ స్థానాన్ని దక్కించుకుంటారని వినిపిస్తున్న పేర్లల్లో మరో వ్యక్తి సానా సతీష్. సీబీఐ కేసుల్లో నిందితునిగా ఉన్న సానా సతీష్.. పార్టీ అధికారంలోకి వచ్చినప్పట్నుంటి చాలా యాక్టీవయ్యారు. గత ప్రభుత్వంలో ఎలాంటి దందా నడిచిందో.. ఇప్పుడూ అదే తరహా దందాను సానా సతీష్ నడుపుతున్నారనేది పార్టీలో బహిరంగంగానే జరుగుతున్న చర్చ. ఇప్పుడున్న పరిస్థితుల్లో సానా సతీష్ రాజ్యసభ టిక్కెట్ దక్కించుకుంటే మాత్రం అదో పెద్ద సంచలనమే అవుతుంది. వీళ్లెవరూ కాకుండా.. పార్టీ అధిష్టానం గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కసరత్తు ఎవరు చేస్తున్నారు..?
రాజ్యసభ అభ్యర్థిత్వాల ఖరారు విషయంలో అసలు ఎవరు కసరత్తు చేస్తున్నారనేది మరింత ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఇదేంటీ.. కసరత్తు చేసేది చంద్రబాబే కదా.. ఈ డౌట్ ఎందుకు వచ్చిందనే వారు లేకపోలేదు. కానీ ఇటీవల కాలంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ.. మంత్రి వర్గ కూర్పు విషయంలోనూ.. అలాగే అధికారుల పోస్టింగుల విషయంలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారులో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అయినా.. లోకేష్ ముద్ర కూడా కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయని ఎవ్వరూ ఓ అంచనాకు రాలేకపోతున్న పరస్థితి ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో కన్పిస్తోంది.
ఎవరికి ఎన్నెన్ని..?
మొత్తంగా మూడు సీట్లు ఖాళీ అయితే.. ఇందులో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తలో స్థానాన్ని తీసుకుంటాయా..? లేక టీడీపీ రెండు తీసుకుని మరో స్థానం జనసేనకు కానీ.. బీజేపీకి కానీ ఇస్తుందా..? అనే క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ రెండు స్థానాలు తీసుకుంటే.. బీజేపీ మరో స్థానం తీసుకుంటుందనేది ఇప్పటి వరకు ఉన్న చర్చ. మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామాలు టీడీపీ ఆపరేషనులో భాగంగా జరిగితే.. బీజేపీ ఆపరేషన్ వల్ల ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారనేది ప్రచారం. కాబట్టి.. రాజ్యసభ స్థానాల కేటాయింపు విషయంలో కూడా ఈక్వేషన్ ఇదే విధంగా ఉండొచ్చనేది ఓ అంచనా. కానీ తెరపైకి జనసేన నుంచి నాగబాబు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. రాజీనామా చేసిన ముగ్గురిలో బీద మస్తాన్ రావుకు తిరిగి టిక్కెట్ దక్కడం ఖాయంగా కన్పిస్తోంది. మోపిదేవి, ఆర్ కృష్ణయ్యల స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఏయే పార్టీకి ఎన్ని దక్కుతాయనే చర్చ కూడా జరుగుతోంది. యథావిధిగా చంద్రబాబు చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇంకో రెండుమూడు రోజులు వేచిచూడాల్సిందే.