- కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కోరిన సీయం రేవంత్
- హైదరాబాద్, బెంగళూరు రక్షణ రంగానికి కీలకమన్న సీయం
రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్- 2025 ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. సభా ప్రాంగణంలో శాస్త్ర రంగంలో దిగ్గజులైన దివంగత భారతరత్నాలు సీవీ రామన్, అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీయం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణ రంగానికి ముఖ్య కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్-, బెంగళూరు నగరాల మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని సీయం కోరారు.
తెలంగాణ రాష్ట్రం.. ప్రత్యేకించి హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి తెలపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీడీఎల్, డీఆర్డీఓ, మిథాని, హెచ్ఏఎల్ వంటి సంస్థలు దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ద్వారా రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్కైరూట్ లాంటి స్టార్టప్ ప్రైవేటు సంస్థలు ఇప్పటికే రాకెట్లను తయారు చేస్తున్నాయని కారిడార్ ప్రకటన రక్షణ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందన్నారు.