30.7 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

నా బ్యాగులు ఎవ్వరూ మొయ్యద్దు…

  • ఫ్లెక్సీలు కటౌట్లు కడితే గెలవరు… ప్రజల్లో ఉంటే గెలుస్తారు…
  • మీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోకండి
  • పేదల మొఖంలో నవ్వు చూస్తేనే మనం బాగా పనిచేసినట్లు
  • టీ కాంగ్రెస్‌ నేతలకు కర్తవ్యబోధ చేసిన మీనాక్షీ నటరాజన్‌

పేదల ముఖంలో నవ్వులు చూసినప్పుడే మనం బాగా పని చేసినట్లు భావించాలని, ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాము… పేదవాడి కోసం పని చేయాలి అని తెలంగాణ కాంగ్రెస్‌ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా శుక్రవారం ఆమె గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అమె ప్రతి నాయకుడి వద్దకు స్వయంగా వెళ్లి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉందని, అనేక రకాల పోరాటాలు చేశామని ఈ పోరాట పటిమ వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్‌ జోడో యాత్ర నిర్వహించిన మనకు ఒక మైదానాన్ని తయారు చేశారని మనం కూడా దాని కోసం పోరాడాలని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వతంత్రాన్ని తెచ్చిందని, ఎలాంటి పోరాటానికైనా కాంగ్రెస్‌ శ్రేణులు సిద్దంగా ఉంటారని అన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలతో మనం పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలను చేపట్టిందని ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలని అభిలషించారు. పదేళ్ళుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని వారికి కూడా న్యాయం జరగాలన్నారు. పదవులు పొందిన వారు ప్రజల కోసం పనిచేయాలని, మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలని మీనాక్షి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మన ప్రభుత్వం కులగణన చేపట్టిందని, ఇది చాలా గొప్ప విషయమని రేవంత్‌ సర్కార్‌ని అభినందించారు. మన నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామానికి వెళ్లి జై బాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేలా పీసీసీ ఒక పకడ్బందీ క్యాలండర్‌ సిద్దం చేయాలని మీనాక్షీ నటరాజన్‌ సూచించారు. ఇక తాను ఏ కార్యకర్త ఫోన్‌ చేసిన మాట్లాడతానని చెప్పారు. ఫ్లెక్సీలు, ఫోటోలు పెడితే ఎన్నికల్లో గెలవరని ప్రజల్లో ఉంటేనే గెలుస్తారని అన్నారు. మనం ఎలాంటి ప్రచారం లేకున్నా స్వతంత్ర పోరాటంలో గెలిచామని పేర్కొన్నారు. నేను వచ్చినప్పుడు నా కోసం ఎవరూ రైల్వే స్టేషన్‌కు రావద్దని, నా బ్యాగులు ఎవ్వరూ మోయద్దని, ఒక వేళ నాకు బలం లేకపోతే నేనే మీ సహాయం అడుగుతానని తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తేల్చి చెప్పారు. ఎవరూ కూడా మీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని మీరు మీ పని చేసుకోండని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ టీకాంగ్రెస్‌ నేతలందరికీ హితవు పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com