23.7 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

త్రిభాషా సూత్రం….దక్షిణాది రాష్ట్రాల అసంతృప్తి సెగలు

హిందీ భాష‌కు వ్యతిరేకంగా దక్షిణ భారతంలో క్రమంగా అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమంలో మొదట తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గళం విప్పగా… అదే రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకురాలు రంజనా నచియార్‌ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

తమిళనాడు సీఎం విమర్శల వాడి పెంచారు. హిందీ భాష ఓ మాస్క్‌ అయితే సంస్కృతం ఓ కనిపించని ముఖమని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఈ మేరకు కార్యకర్తలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మూడు భాష‌లు నేర్చుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ తెచ్చిన విష‌యం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణ‌యాన్ని డీఎంకే వ్య‌తిరేకిస్తున్న‌ది. బీహార్‌, యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాట్లాడే మైథిలీ, బ్రిజ్‌భాష, బుందేల్‌ఖండ్‌, అవ‌ధి లాంటి స్థానిక భాష‌లు.. హిందీ భాష ఆధిప‌త్యంతో అంతరించిపోయాయని నివేదికలు ఉన్నాయి. హిందీ-సంస్కృత భాషల ఆధిప‌త్యంతో ఉత్త‌రాదికి చెందిన సుమారు 25 ప్రాచీన భాష‌లు అంతర్ధానమయ్యాయి.

శ‌తాబ్ధ కాలం నుంచి హిందీని వ్యతిరేకిస్తూ… ద్ర‌విడ ఉద్య‌మంతో త‌మిళ భాష, సంస్కృతిని ర‌క్షించుకుంటున్నారు. మూడు భాష‌ల పాల‌సీ షెడ్యూల్ ద్వారా.. చాలా వ‌ర‌కు రాష్ట్రాల్లో సంస్కృతాన్ని మాత్ర‌మే ప్ర‌మోట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ద్ర‌విడ నేత‌, దివంగ‌త మాజీ సీఎం సీఎన్ అన్నాదురై.. త‌మిళ‌నాడులో ద్విభాషా విధానం అమ‌లుకు ప్రాముఖ్య‌త ఇచ్చారు. హిందీ-సంస్కృతం అమ‌లుతో త‌మిళ సంస్కృతి న‌ష్ట‌పోతుంద‌ని పార్టీలకు ఆతీతంగా ఆ రాష్ట్రంలో నేతలు మండిపడుతున్నారు.

దక్షిణాదిలో త్రిభాషా విధానాన్ని అమ‌లు చేస్తే మాతృభాష‌ని ప‌ట్టించుకోరని, భ‌విష్య‌త్తు అంతా హిందీ సంస్కృత‌మే అవుతుంద‌ని దక్షిణాది నేతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకించింది. మరోవైపు తెలంగాణలో అన్ని రకాల పాఠశాలల్లో తెలుగు అమలు చేసి తీరవలిసిందే అని ప్రభుత్వం జీవో జారీ చేసింది. CBSE, ICSE, SSC ఏదైనా సరే రెండో భాషగా తెలుగు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం తేటతెల్లం చేసింది.

కేంద్రం నిర్ణయాన్ని నేరుగా విమర్శించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషాభివృద్ధికి పది కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రకటించారు. దాన్ని ఏ విధంగా తెలుగు భాష పరిరక్షణకు వినియోగిస్తారో చూడాలి.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో కేంద్రం నిర్ణయంపై ఎటూతేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. హిందీని వ్యతిరేకిస్తే ఉత్తరాదిలో పార్టీ దెబ్బతింటుంది. వ్యతిరేకించకపోతే రాష్ట్రంలో భాషాభిమానుల నుంచి అసంతృప్తి జ్వాలలు ఎదుర్కోవాలి.

భాషా ఉద్యమం ఇదేవిధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో హిందీ వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ఎన్నిసార్లు వ్యతిరేకించినా కేంద్రంలో కాంగ్రెస్,బిజెపిలతో సంబంధం లేకుండా ఎవరున్నా హిందీని రుద్దేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com