33.1 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ఉగ్రవాదిగా మారిన ఇంజనీర్… మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌..

  • దిల్‌షుక్ నగర్ బాంబు బ్లాస్ట్ ఘటనలో కీలక దోషి
  • ఉరిశిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు
  • దేశవ్యాప్తంగా సీరియల్ బాంబ్ బ్లాస్టుల వ్యూహకర్త
  • కర్ణాటకలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఆపై ఉగ్రవాదంలోకి
  • పాక్ మదర్సాలో శిక్షణ.. బాంబులు అమర్చడంలో దిట్ట
  • ప్లాన్ చేశాడంటే గురి తప్పే ఛాన్స్ లేదు
  • తలపై 10 లక్షల రివార్డు
  • మొబైల్స్,ఈ మెయిల్స్ వాడడు.. ఒకచోట ఉండడు
  • ప్రాంతాలు, వ్యూహాలు పదే పదే మార్చే ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌

యాసిన్ భత్కల్.. ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది అయిన ఇతగాడు దిల్‌ షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఉరి శిక్ష నెదుర్కొంటున్న వారిలో ఒకడు. మనదేశంలో ఎన్నో తీవ్రవాద ఘటనలకు, బాంబు పేలుళ్లకు పరోక్షంగా కారకుడు కూడా. 2013,ఫిబ్రవరి 21న దిల్‌ షుక్ నగర్ బస్టాప్ సమీపంలో ద్విచక్ర వాహనాలకు బాంబు అమర్చిన ఇతగాడు పుణే, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాద బృందంలో ఒకడు. ఇండియన్ ముజాహిదీన్ అనే మిలిటెంటు గ్రూపుకు నాయకత్వం వహించిన వ్యక్తి. భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా పరిణమించిన ఇతగాడు ఎట్టకేలకు దిల్‌ సుఖ్ నగర్ బాంబు బ్లాస్టు కేసులో దోషిగా తేలి ఉరిశిక్ష పడిన వ్యక్తి. దేశం వదిలి పారిపోయే ప్రయత్నం చేసిన ఇతగాడిని నేపాల్‌ సరిహద్దుల్లో భారత అధికారులు పట్టుకున్నారు.

భత్కల్ తలపై పది లక్షల రివార్డు..

భత్కల్ అసలు పేరు మహమ్మద్ అహ్మద్ జరార్ సిద్దిబాబా. అతని తలపై 10 లక్షల రివార్డు కూడా ఉంది. దేశంలో వరుస బాంబు పేలుళ్లకు కారకుడైన భత్కల్ ను మరో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ తో కలిపి పోలీసులు అరెస్టు చేయగలిగారు.2010లో వీరిద్దరు కలసి పుణెలో జర్మన్ బేకరీ లో బాంబు పేలుళ్లకు కారకులయ్యారు. ఆ ఘటనలో 17 మంది చనిపోగా 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటినుంచి ఈ గ్రూప్ ను నిషేధిత ఉగ్ర బృందంగా ఎన్‌ ఐఏ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత 2011లో ముంబైలోనే మరో మూడు చోట్ల బాంబు పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ కారణమైందని తేలడంతో వారిని నిషేధిత జాబితాలో చేర్చారు. 2011లో ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో 27 మంది అమాయకులు బలయ్యారు. ఇన్ని జరిగినా తన కొడుకు అమాయకుడనీ, ఉగ్ర సంఘటనలతో సంబంధం లేదని భత్కల్ తండ్రి వాదిస్తూ వచ్చాడు. తన కుమారుడు  తీవ్రవాది అని తేలితే శిక్షించాలి అని.. నిజం తేలనంత వరకూ అందరూ నిర్దోషులేనని భత్కల్ తండ్రి సవాల్ చేస్తూ వచ్చాడు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని ఏ వ్యక్తీ నేరం రుజువు కానంత వరకూ నిర్దోషి కిందే లెక్క అనీ వాదిస్తూ వచ్చాడు.

బాంబుల తయారీ, లాజిస్టిక్స్ ఎక్స్ పర్ట్

యాసిన్ భత్కల్ బాంబులను తయారు చేయడంలో దిట్ట.అంతేకాదు బాంబులను తయారు చేశాక వాటిని ఒక చోట నుంచి మరో చోటకి తరలించడంలో కూడా భత్కల్ చేయి తిరిగిన వాడే.ఎంతో మందికి బాంబుల తయారీలో శిక్షణ కూడా ఇచ్చాడు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలో యాసిన్ భత్కల్ చాలా చాలా కీలకమైన క్రియాశీలక నేత. సుశిక్షితులైన ఉగ్రవాదులను పట్టుకోవడం చాలా కష్టం.

పాక్ లో శిక్షణ

యాసిన్ భత్కల్ 1983లో కర్ణాటకలో పుట్టాడు. ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మదరసాలో చేరి శిక్షణ పొందాడు. చదువుకునే వయసులోనే ముస్లిం ఛాందస వాద భావజాలానికి, ఆ వర్గాలకు దగ్గరయ్యాడు. 2002లో గుజరాత్‌లో ముస్లిం వ్యతిరేక అల్లర్లను చూసి ద్వేషం పెంచుకున్నాడు. అదే ఇండియన్ ముజాహిదీన్ లో చేరేందుకు నాంది పలికినట్లు దర్యాప్తు బృందాల సమాచారం.

ఇంజనీరింగ్‌ తర్వాత దుబాయ్ లో దుస్తుల దుకాణం నడుపుతున్న తండ్రికి చేదోడు వాదోడు గా ఉండేందుకు దుబాయ్ వెళ్లిన భత్కల్ తన ఛాందసవాద భావజాలం వల్ల తండ్రితో ఇమడలేక అక్కడ నుంచి బయటపడ్డాడు.2008లో మళ్లీ భారత్ తిరిగొచ్చి అప్పటినుంచి ఇండియన్ ముజాహిదీన్ సంస్థ కోసం పెద్ద ఎత్తున చందాలు వసూలు చేయడం, బాంబుల తయారీపై దృష్టి పెట్టడంలాంటి కార్యకలాపాలలో బిజీ అయిపోయాడు. నకిలీ కరెన్సీ స్కామ్ లో కూడా చిక్కుకున్నాడు. యాసిన భత్కల్ ప్లాన్ చేశాడంటే గురి తప్పకుండా  బాంబు పేలాల్సిందే. బాంబు బ్లాస్ట్ టార్గెట్ ను కరెక్ట్ గా ఫిక్స్ చేస్తాడు. పైగా గురి పెట్టామంటే ఆ పని అయిపోవాల్సిందే అన్నంత పట్టుదలతో వ్యవహరిస్తాడు.

క్లెయిమ్ చేసుకోడు…

సాధారణంగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఏదైనా టార్గెట్‌ పూర్తి చేశారంటే అది తమ  పనేనని  రెండు, మూడు రోజుల తర్వాతైనా క్లెయిమ్ చేస్తారు. కానీ భత్కల్ అందుకు పూర్తిగా భిన్నం. ఇటువంటి ప్రచారాలపై అస్సలు దృష్టి పెట్టడు. బాంబు పేలుడుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తోంది. కారకులను పట్టుకోడం కోసం ప్రయత్నాలు ఎలా చేస్తోంది? ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతోంది? లాంటి సమాచారం అంతా గ్రహించి ఎప్పటి కప్పుడు వ్యూహం మారుస్తుంటాడు.

చిక్కడు.. దొరకడు…

ఇండియన్ ముజాహిదీన్ లో ఉగ్రవాదులను రిక్రూట్‌ చేసుకోవడం, శిక్షణ ఇప్పించడం, కుట్రలు పన్నడం, అందుకు అవసరమైన లాజిస్టిక్స్ సమకూర్చడం లాంటి రోజు వారీ కార్యకలాపాలతో బిజీగా ఉంటాడు. బాంబు పేలుళ్లలో యువతకు శిక్షణ ఇవ్వడమే కాక వారి సందేహాలను తీరుస్తుంటాడు. వారికి ముఖా ముఖి మద్దతు కూడా తెలుపుతాడు. బాంబు పేలుడు జరపడానికి రెండు రోజుల ముందే ఆ ప్రాంతాన్ని సందర్శించి రెక్కీ నిర్వహించడంలో భత్కల్ స్పెషలిస్టు.

తరచుగా ప్రదేశాలు మార్చేస్తాడు…

యాసిన్ భత్కల్ ఒక చోట స్థిరంగా ఉండడు. తరచుగా ప్రాంతాలు మారుస్తుంటాడు. తన నెట్ వర్క్ ను ఎప్పుడు సదా, సిద్ధంగా ఉంచుకుంటాడు. ఎవ్వరినీ నమ్మడు. ప్రతీదీ వ్యక్తిగతంగా పరిశీలించాకే అడుగు ముందుకేస్తాడు. ఎప్పుడో గానీ మొబైల్ వాడడు. ఈమెయిల్‌ కూడా వాడడు. పాకిస్థాన్ లో శిక్షణ పొందిన భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ లో టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్‌ తెలిసిన వ్యక్తి.

ఇప్పుడు దిల్‌ షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో తెలంగాణ హై కోర్టు యాసీన్ భత్కల్ సహా మరికొందరికి ఉరిశిక్ష విధించింది. హై కోర్టు తీర్పుతో నిందితులు సుప్రీం కోర్టుకు అపీల్ చేసుకునే వీలుంది. అక్కడా ఉరే సరి అని తేలితే చివరి అస్త్రంగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం విన్నపం చేసుకోవడమే. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే రాష్ట్రపతి క్షమాభిక్షను ప్రసాదిస్తారు. ఈ దశల్లో ఎక్కడా ఊరట లభించకపోతే.. చివరికి ఉరికంబం ఎక్కాల్సిందే..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com