- ఆర్థిక మంత్రిగా 8వసారి బడ్జెట్ సమర్పణ
- ఆతర్వాత రికార్డు మొరార్జీది..వరుసగా ఆరుసార్లు
- దేశచరిత్రలో మొరార్జీ రికార్డు పదిలం
- పది సార్లు బడ్జెట్ పెట్టిన ఆర్ధిక మంత్రి
- నెహ్రూ, ఇందిర బడ్జెట్ అందించిన ప్రధానులు
- మొదటి బడ్జెట్ తొట్టతొలి ఆర్థిక మంత్రి షణ్ముగం షెట్టి చేతుల మీదుగా
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. మన దేశానికి ఈ శనివారం 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మోడీ నేతృత్వంలోని బీజేపి ప్రభుత్వం నాలుగు దఫాల విజయం ఈ సుదీర్ఘ రికార్డుకు కారణమైంది. సాధారణంగా అదే ప్రభుత్వం అధికారంలో ఉన్నా మంత్రి పదవులు మారుతుండొచ్చు. కానీ మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి మధ్యంతర బడ్జెట్ మాత్రమే మంత్రి పియూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. ఆయనిప్పుడు పరిశ్రమలు, వాణిజ్య శాఖను నిర్వహిస్తున్నారు. పీయూష్ తర్వాత 2019- – 20 నుంచి వరుసగా ఇప్పటి వరకూ అన్ బీటబుల్ రికార్డు మాత్రం నిర్మలదే.
నిర్మల తర్వాత మొరార్జీదే హవా…
నిర్మలమ్మకు ముందు వరకూ వరుసగా ఎక్కువ సార్లు బడ్జెట్లు ప్రవేశ పెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ దే.. పండిట్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీల ప్రభుత్వాలలో ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ ఆరు సార్లు వరుసగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.1977లో మొరార్జీ ప్రధానిగా పనిచేశారు.
ఓవరాల్ గా పదిసార్లు మొరార్జీనే…
మొరార్జీ దేశాయ్ కు మరో అరుదైన రికార్డు ఉంది. మధ్య మధ్యలో విరామాలను పక్కన పెడితే దేశ చరిత్రలోనే పదిసార్లు బడ్జెట్ లను ప్రవేశ పెట్టిన ఘనత ఆయనదే. జనతాదళ్ నేత అయిన మొరార్జీ 1959లో తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు.1959-1963 మధ్యకాలంలో ఆయన ఐదుసార్లు పూర్తి బడ్జెట్ ను, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆపై నాలుగేళ్ల విరామం తర్వాత 1967లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.అప్పటినుంచి వరుసగా మూడుసార్లు 1967,1968,1969 లలో మూడు బడ్జెట్ లు దేశానికి అందించిన ఘనత మొరార్జీదే. ఈ లెక్కన చూస్తే పది బడ్జెట్ లు దేశానికి అందించిన ఘనత ఆయనకు దక్కుతుంది.
బడ్జెట్ అందించిన ప్రధానులు…
ఆర్ధిక మంత్రులే కాదు.. దేశ ప్రధానులూ బడ్జెట్ లను అందించిన చరిత్ర మనకుంది.1958– – 59 మధ్యకాలంలో ఆర్థిక శాఖను కూడా నిర్వహించిన మాజీ ప్రధాని పండిట్ నెహ్రూ అప్పట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.1969–70 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా మొరార్జీ రాజీనామా చేయడంతో అప్పటి ప్రధాని ఇందిర స్వయంగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టాల్సివచ్చింది.
తొట్టతొలి బడ్జెట్ ఎప్పుడంటే…
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1947లో అప్పటి తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె.షన్ముగం షెట్టి మొదటి బడ్జెట్ ను అందించారు. దాని విలువ రూ.197.1 కోట్లు.అప్పట్లో మన ఆదాయ వనరులు పరిమితం. ఖర్చులుకూడా అందుకు తగ్గట్లు ఉండేవి. కానీ నేడు మన ఆదాయమూ పెరిగింది. అంతకుమించి ఖర్చు పెరిగింది. 2024–25 మధ్యకాలంలో బడ్జెట్ అంచనాల మొత్తం వ్యయం రూ.48,20,512 కోట్లకు పెరిగింది. దీనిలో మూల ధన వ్యయం అంచనా రూ.15,01,889 కోట్లు. ఇది సవరించిన అంచనాల ప్రకారం చూస్తే 18.2 శాతం పెరుగుదల.