28.4 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

అస్మదీయులకే బిల్లులు…అసంతృప్తిలో కాంట్రాక్టర్లు

ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆర్థిక శాఖతో తలెత్తిన వివాదం నేపథ్యంలో పలు అంశాలు తెరపైకి వచ్చాయి. బిల్లుల చెల్లింపుపై ఫస్ట్‌ ఇన్ ఫస్ట్‌ ఔట్ విధానం అమలు చేయాలని కాంట్రాక్టర్లు మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో అమలు చేస్తున్న విధానాల్లో లోపాలను కాంట్రాక్టర్లు ఎత్తి చూపుతుంటే తమ చేతుల్లో ఏముందని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దాదాపు 7వేల మంది గుత్తేదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.3వేల కోట్ల రుపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి నెలాఖరులోగా బ్యాంకు రుణాలను రీ షెడ్యూల్ చేయడం కోసం బకాయిల్లో కొంత మేరకు విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు దగ్గరగా ఉండేవారికే బిల్లులు మంజూరు అవుతున్నాయని కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కాంట్రాక్టర్లు చేపట్టిన హై ఇంపాక్ట్‌ పనులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పనులు, పోలవరం పునరావాస కాలనీల నిర్మాణం, పీహెచ్‌సీల నిర్మాణం, తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణం, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు, కాల్వల మరమ్మతులు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, హౌసింగ్, డ్రైనేజీ వంటి పనులు కూడా చేశారు. గత ఐదేళ్లలో చేపట్టిన పనులతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలుగా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు భారీగా బకాయి పడ్డారు. నియోజక వర్గాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల్ని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో ఆగమేఘాలపై పనులు అప్పగించి పూర్తి చేయించారు.

బిల్లుల చెల్లింపు వ్యవహారంలో కొత్త పద్ధతులు మొదలయ్యాయి. ముందు పూర్తి చేసిన పనులకు ముందుగా చెల్లించే విధానానికి తిలోదకాలు ఇచ్చారు. బడా కాంట్రాక్టు సంస్థలకు మాత్రమే చెల్లింపులు చేస్తూ చిన్నాచితక కాంట్రాక్టర్లను వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్వోసిల నుంచి చెల్లింపుల వరకు కొందరికే ప్రాధాన్యత ఇవ్వడంపై కాంట్రాక్టర్లలో అసహనం నెలకొంది. ఈ క్రమంలో రాయలసీమలోని చిత్తూరు, కడప, పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం వెలుగు చూసింది. అయా ప్రాంతాల్లో చేపట్టిన పనుల్ని క్యాపిటల్ హెడ్స్‌ నుంచి నిధులు కేటాయించడంతో ప్రభుత్వం మారినా వాటికి నిధుల కొరత లేకుండా చెల్లింపులు జరిగిపోయినట్టు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ బాధ్యులు సూచించిన వారికి మాత్రమే చెల్లింపులు జరిగాయని, గత ప్రభుత్వంలో నష్టపోయినట్టే ఇప్పుడు కూడా చిన్న కాంట్రాక్టర్లు రోడ్డున పడుతున్నారని చెబుతున్నారు. కాంట్రాక్టర్లకు ఏప్రిల్‌ వరకు బిల్లులు చెల్లించలేమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చి చెప్పడం కాంట్రాక్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది.

అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. బిల్లుల చెల్లింపు ప్రాధాన్యతలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఇందులో ఆర్థిక శాఖ పాత్ర నామమాత్రంగా ఉందని చెబుతున్నారు. బిల్లుల చెల్లింపు కోరుతూ ఆర్థిక శాఖకు కాంట్రాక్టర్లు వచ్చినపుడు కూడా ప్రభుత్వ పెద్దలను సంప్రదించాలని సెక్రటరీ సూచించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక స్థితి బిల్లులకు చెల్లింపుకు అనువుగా లేదని,ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు, తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలకు అతి కష్టమ్మీద నిధులు సమీకరిస్తున్నట్టు చెబుతున్నారు. కాంట్రాక్టర్ల సమస్యపై అధికారులకు సానుభూతి ఉన్నా ఖాలీ  ఖజానా నేపథ్యంలో చెల్లింపులపై సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని ఏపీ ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొందరికే చెల్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణల్ని కూడా ఆర్థిక శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రాధాన్యత క్రమంలో అందరికి పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేస్తున్నట్టు చెప్పారు. 2014-19 మధ్య కాలంలో పెండింగ్  బిల్లుల్ని ఇప్పుడు క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు. బిల్లులు ఎవరికి చెల్లించాలనే నిర్ణయం అధికారుల వద్ద ఉండదనే సంగతి కాంట్రాక్టర్లకు కూడా తెలుసని,  ప్రభుత్వంతోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com