37.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

కుంభ మేళాలో భక్తులను చెదరగొట్టారా? పోలీసులపైకి జనం చెప్పులు విసిరారా? – భాస్కర నిజ నిర్ధారణ

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అట్టహాసంగా జరుగుతోంది. కోట్లాది మంది జనం త్రివేణీ సంగమానికి వెళ్లి.. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా ఈనెల 26వ తేదీతో ముగియనుంది. అయితే, రోజు రోజుకూ మహా కుంభమేళాకు తరలివస్తున్న జన సందోహం పెరగుతూనే ఉంది. దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాత్రికులు ప్రయాగ్‌ రాజ్‌ వస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.

యాత్రికుల రద్దీకి తగినట్లు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు ఆరు నెలల ముందు నుంచే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయితే, ఊహించిన దానికంటే భక్తులు ఎక్కువగా తరలివస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. భక్తులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంతగా ప్రయత్నాలు చేస్తున్నారు.

జరుగుతున్న ప్రచారం :

ఇదే సమయంలో సోషల్ మీడియాలో మహా కుంభమేళాకు సంబంధించిన ఫేక్‌ న్యూస్‌ పెద్ద మొత్తంలో వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడో జరిగిన, ఈ సందర్భానికి సంబంధం లేని ఫోటోలు, వీడియోలను జోడిస్తూ కుంభమేళాలో సమస్యలు అంటూ, కుంభమేళాలో అగ్ని ప్రమాదం అంటూ.. భక్తుల ఇక్కట్లు అంటూ.. రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో పలువురు ఓ వీడియోను పోస్ట్‌ చేసి కుంభమేళాలో భక్తులపైకి భద్రతా బలగాలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, దీనికి నిరసనగా యాత్రికులు పోలీసులపైకి చెప్పులు విసురుతున్నారంటూ ఆ వీడియోలకు రైటప్‌లు జోడిస్తున్నారు. వాటిని ఓసారి పరిశీలిద్దాం…

ఇందర్‌జీత్‌ బారక్‌ (Inderjeet Barak🌾 @inderjeetbarak) అనే ఎక్స్‌ యూజర్‌ ఫిబ్రవరి 12వ తేదీన తన హ్యాండిల్‌పై ఈ వీడియో పోస్ట్‌ చేశాడు. కుంభమేళాలో భద్రతా బలగాలు, యాత్రికులకు మధ్య ఘర్షణ జరిగిందని, విసుగుచెందిన యాత్రికులు పోలీసులపైకి చెప్పులు విసిరారన్నది దీని సారాంశం.

సునీల్‌ అనే మరో వ్యక్తి కూడా తన (SUNIL @sunil1997_) ఎక్స్‌ హ్యాండిల్‌పై ఇదే వీడియోను పోస్ట్‌ చేసి సేమ్‌ కామెంట్‌ చేశాడు. అయితే, సునీల్‌.. ఫిబ్రవరి 13వ తేదీన ఎక్స్‌లో ఈ పోస్ట్‌ చేశాడు.

వీళ్లే కాదు.. నిహాల్‌ షేక్‌ అనే ఇంకో ఎక్స్‌ యూజర్‌ (Nihal Shaikh @mr_nihal_sheikh) కూడా ఇదే వీడియోను ఎక్స్‌ హ్యాండిల్‌పై పోస్ట్‌ చేశాడు. ఫిబ్రవరి 13వ తేదీన పోస్ట్‌ చేసి.. భద్రతా బలగాలపైకి యాత్రికులు చెప్పులు విసిరారని పేర్కొన్నాడు.

భాస్కర న్యూస్‌ నిజ నిర్ధారణ :

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ పోస్టులను భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ పరిశీలించింది. సోషల్ మీడియాలోనే శోధించింది. వీడియోలోని కీ ఫ్రేమ్స్‌ ఇన్‌విడ్‌ టూల్‌ ద్వారా సేకరించి రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో వెతకడం జరిగింది. ఇలా శోధిస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, యూట్యూబ్‌లోనూ ఈ వీడియోకు సంబంధించిన వాస్తవ పోస్టింగులు లభ్యమయ్యాయి. పైన పేర్కొన్న సోషల్‌ మీడియా యూజర్లు చేసిన కామెంట్లు తప్పు అని తేలింది. ఇదే వీడియోను చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు, ట్విట్టర్‌ యూజర్లు, యూట్యూబ్‌ యూజర్లు కూడా పోస్ట్‌ చేశారు. ఈ వీడియో పుష్ప-2 సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ సందర్భంగా రికార్డ్‌ చేసిందన్న విషయం అనేక ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్‌ చేయడం జరిగింది. అలాగే, పుష్ఫ మూవీ టీమ్‌ అఫీషియల్‌ ఎక్స్‌ హ్యాండిల్‌ను కూడా పరిశీంచినప్పుడు ఈ వేడుక జరిగింది బీహార్‌లోని పాట్నాలో ఉన్న గాంధీ మైదానంలో అని తేలింది.

travelwithaashi21 అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్‌లో ఇలా ఫ్యాన్స్‌ చెప్పులు విసిరారని ఒరిజినల్‌ వీడియో పోస్ట్‌ చేశారు.

https://www.instagram.com/p/DCedpTGBJeA/

అలాగే, showsha అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో కూడా ఈ ఒరిజినల్‌ వీడియో పోస్ట్‌ చేశారు.

అలాగే, ఆ వాస్తవ వీడియోలు పోస్ట్‌ చేసిన సమయంలో వార్తా కథనాలు పరిశీలించడం జరిగింది. దాదాపు అన్ని వార్తా సంస్థలు ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వాస్తవాలు రిపోర్ట్‌ చేశాయి. న్యూస్‌ 18 వార్తా వెబ్‌సైట్‌ లింక్‌లో ఉన్న పూర్తి వార్తను పరిశీలిస్తే.. పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో అభిమానులు గందరగోళం సృష్టించడంతో అక్కడున్న భద్రతా బలగాలు వారిని చెదరగొట్టారు. దీంతో, కొందరు జనంలోంచి పోలీసుల మీదకు చెప్పులు విసిరారు.. అని రిపోర్ట్‌ చేసింది. ఆ లింక్‌ కింద గమనించవచ్చు.

https://www.news18.com/india/pushpa-2-trailer-launch-fans-create-chaos-in-patna-security-personnel-retort-to-lathi-charge-watch-9123534.html

ఇండియా టుడే ఎక్స్‌ హ్యాండిల్‌లోనూ వీడియో సహితంగా ఈ వివరాలు పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ను కింద చూడొచ్చు.

https://x.com/IndiaToday/status/1858150068773343641

============================================================

వైరల్‌ అవుతున్నదేంటి ?
మహా కుంభమేళాలో భద్రతా బలగాలు, జనానికి ఘర్షణ జరిగింది. యాత్రికులు పోలీసులపైకి చెప్పులు విసిరారు.
వాస్తవం ఏంటి ?
ఈ వీడియో పుష్ప-2 సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు సంబంధించినది. పాట్నాలో జరిగిందీ వేడుక. దీనిని ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో జరిగినట్లు వైరల్‌ చేస్తున్నారు.
భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ :
సోషల్‌ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారం. భాస్కర న్యూస్‌ ఫ్యాక్ట్‌చెక్‌ టీమ్‌ పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడయ్యింది.

============================================================

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com