తొలితరం కథానాయిక, నిర్మాత కృష్ణవేని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కృష్ణవేణి ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారు. 1936లో సతీ నసూయతో సినిమా రంగానికి పరిచయం అయిన కృష్ణవేణి మీర్జాపురం రాజాను ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణవేణి నిర్మాతగా 1949లో తీసిన మనదేశం సినిమా ద్వారా ఎన్టీఆర్‌ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు.
బాలకృష్ణ సంతాపం
రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, నందమూరి తారక రామారావు నటజీవితానికి తొలుత అవకాశం కల్పించిన నటి, నిర్మాత కృష్ణవేణి సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయమని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. మన దేశం లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారని అన్నారు. కృష్ణవేణి ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డులు అందుకొన్నారని ఇటీవల ఎన్ టి ఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకు ముందు ఎన్ టి ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా కృష్ణవేణిని ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు నందమూరి బాలకృష్ణ .