తూళ్ల దేవేందర్‌గౌడ్.. ఒకప్పుడు తెలుగు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీసీ నాయకుడు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన దేవేందర్ గౌడ్.. అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా సుదర్ఘీ రాజకీయ అనుభవం గడించారు. ఎన్టీఆర్ కేబినెట్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, చంద్రబాబు క్యాబినెట్లో హోం శాఖ మంత్రి పనిచేశారు. ఒక దశలో టీడీపీలో నంబర్-2గా ఎదిగారు. కానీ, ఆయన తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం ఆయన రాజకీయ పయనంలో ఊహించని జర్క్ ఇచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ఆ పార్టీ ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దేవేందర్‌గౌడ్‌ను బాగా ఎంకరేజ్ చేశారు. ఫలితంగా 1988 నుంచి 2008 వరకు దేవేందర్ గౌడ్ రాజకీయంగా ఎదురు లేకుండా ఉన్నారు. అయితే, 2008లో దేవేందర్ గౌడ్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన రాజకీయ జీవితానికి శాపంగా పరిణమించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఊపందుకున్న రోజుల్లో టీడీపీ వైఖరిని ఆయన బాహాటంగానే వ్యతిరేకించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. నవ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఈ విషయంలో కేసీఆర్‌కు, దేవేందర్ గౌడ్‌కు సారూప్యత ఉంది. కానీ, అది టీడీపీ నుంచి ఈ ఇద్దరు నాయకులు బయటకురావడం, తెలంగాణ పేరుతో పార్టీలు పెట్టడం వరకే. అయితే, కేసీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం సాధించింది తానే అని బ్రాండ్ సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దేవేందర్ గౌడ్, కేసీఆర్ లక్ష్యం ఒకటే అయినా.. కేసీఆర్ బాణం సరైన దిశగా పయనించింది. దేవేందర్ గౌడ్ బాణం మాత్రం గురి తప్పింది. నవ తెలంగాణ పార్టీ విఫలమైంది. అతి తక్కువ కాలానికే ఆ పార్టీని మూసేశారు దేవేందర్ గౌడ్. ఆ తర్వాత దేవేందర్‌గౌడ్ మరో తప్పు చేశారు. నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా.. ప్రజల నాడి పట్టుకోవడంలో దేవేందర్ గౌడ్ విఫలమయ్యారు. ఆ తర్వాత ఆలస్యంగా తన పొరపాట్లను అర్థం చేసుకున్నారు. తన తప్పు ఒప్పుకుని.. మళ్లీ తెలుగుదేశం పార్గీలో చేరారు. రాజ్యసభ్యుడయ్యారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు దేవేందర్ గౌడ్ దూరమయ్యారు. ఇక, చాలాకాలం తర్వాత దేవేందర్ గౌడ్ మళ్లీ తెరపై కనిపించారు. టీడీపీలో తన సహచరుడు అయిన రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తాను రాసిన ‘విజయ తెలంగాణ’ పుస్తకం ఆవిష్కరింప చేశారు.
నాడు తెలుగు దేశం పార్టీలో దేవేందర్‌గౌడ్ నంబర్-2గా ఉన్న సమయంలో అట్టడుగున ఉన్నవాళ్లు, పెద్దగా పాపులారిటీ లేని వాళ్లు ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దేవేందర్ గౌడ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సమయంలో రేవంత్‌రెడ్డి అసలు ఉనికిలోనే లేరు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఎమ్మెల్యేగా ఉన్నా పెద్దగా ప్రాధాన్యత లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నా ఆయనకు కూడా అంతగా ప్రాధాన్యత లేదు. కానీ, అలాంటి అనేక మంది టీడీపీ నేతలు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్లో చేరారు. తర్వాత మంత్రులు అయ్యారు. రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న కేసీఆర్, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దేవేందర్‌గౌడ్ పొలిటికల్ కెరీర్ మాత్రం ముగిసింది. తొందరపాటు నిర్ణయం కారణంగా రాజకీయాల్లో ఉత్థాన పతనాలకు దేవేందర్ గౌడ్ ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.